యుద్ధంలో పాల్గొనాలంటూ నోటీసు.. తనవల్ల కాదంటూ భవనం పైనుంచి దూకి రష్యన్ డిస్క్ జాకీ ఆత్మహత్య
- ఉక్రెయిన్‌తో సుదీర్ఘంగా కొనసాగుతున్న యుద్ధం
- నిర్బంధ సైనిక సమీకరణ చేపడుతున్న రష్యా
- ప్రత్యర్థులను చంపలేనంటూ 10వ అంతస్తు పైనుంచి దూకి డీజే ఆత్మహత్య
- పుతిన్‌ను యుద్ధోన్మాదిగా అభివర్ణించిన డిస్క్ జాకీ
- ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో
ఈ క్రమంలో క్రాస్నోడార్ నగరానికి చెందిన 27 ఏళ్ల ర్యాపర్ డీజే ఇవాన్ విటలీవిచ్ పెటునిన్‌కు కూడా ప్రభుత్వం నుంచి నోటీసు అందింది. వాకీ పేరుతో స్టేజి షోలు ఇచ్చే ఈ డీజే.. యుద్ధం పేరుతో ప్రత్యర్థుల ప్రాణాలు తీసేందుకు తాను సిద్ధంగా లేనంటూ ఓ భారీ భవనంలోని 10వ అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు అతడు ఓ సెల్ఫీ వీడియోలో మాట్లాడుతూ.. పాక్షిక సైనిక సమీకరణ అని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ త్వరలోనే అది పూర్తిస్థాయిలో జరుగుతుందని అనుమానం వ్యక్తం చేశాడు. పుతిన్‌ను యుద్ధ ఉన్మాదిగా అభివర్ణించిన పెటునిన్.. ఈ వీడియోను మీరు చూసే సమయానికి తాను సజీవంగా ఉండనని పేర్కొన్నాడు. కాగా, పెటునిన్ గతంలో సైన్యంలో చేశాడని, ప్రస్తుతం మానసిక చికిత్స తీసుకుంటున్నట్టు అమెరికన్ మీడియా పేర్కొంది.