దేశంలో ఎత్తయిన టవర్ల కూల్చివేత వీక్షించేందుకు వీఐపీ గ్యాలరీ!

Noida twin towers demolition today
  • మధ్యాహ్నం 2.30కు నోయిడాలో సూపర్టెక్ టవర్ల కూల్చివేత 
  • సమీపంలోని 5 వేల మంది నివాసితులను ఖాళీ చేయించిన అధికారులు
  • కూల్చివేత సయమంలో సమీపంలోని నోయిడా ఎక్స్ ప్రెస్ వే  మూసివేత
భారత దేశంలోనే అత్యంత ఎత్తయిన నివాస సముదాయాలైన నోయిడా జంట భవనాల కూల్చివేతకు రంగం సిద్దమైంది. నోయిడాలో అక్రమంగా నిర్మితమైన 100 మీటర్ల ఎత్తు ఉన్న ఈ టవర్లు కొన్ని సెకండ్లలో నేల మట్టం కానున్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఈ భవనాలను భారీ పేలుడు పదార్థాలను అమర్చి నేటి మధ్యాహ్నం 2.30 గంటలకు కూల్చివేయనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 

నోయిడాలో సూపర్‌టెక్‌ సంస్థ అక్రమంగా నిర్మించిన జంట భవనాల కూల్చివేతకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ చుట్టుపక్కల కాలనీల్లో నివసిస్తున్న ప్రజల్లో ఆందోళన మొదలైంది. సాధారణంగా విదేశాలలో ఇలాంటి ఎత్తైన భవనాలను నేలమట్టం చేస్తుంటారు. భారత్ లో ఇంత పెద్ద నిర్మాణాన్ని కూల్చివేయడం ఇదే మొదటి సారి. ఈ నేపథ్యంలో టవర్ల కూల్చివేతను దూరం నుంచి చూసేందుకు వీఐపీ గ్యాలరీలు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. దాదాపు అన్ని టీవీ చానళ్లు కూల్చివేతను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి.

సమయం, భద్రత అంశాలను దృష్టిలో ఉంచుకొని పేలుడు పదార్థాల ద్వారా ''కంట్రోల్డ్‌ ఇంప్లోజన్‌ '' (వాటర్‌ఫాల్‌ ఇంప్లోజిన్‌) విధానంతో కొన్ని సెకండ్లలో కూల్చేయనున్నారు. ఈ టెక్నిక్‌ను 1773లో ఐర్లాండ్‌లోని వాటర్‌ఫోర్డ్‌లో హోలీ ట్రినిటీ కేథడ్రాల్‌ భవనం కూల్చివేతకు తొలిసారిగా ఉపయోగించారు. వంతెనలు, సొరంగాలు, భవనాలు, ఇతర నిర్మాణాలను కూల్చివేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఈ విధానమే అత్యంత భద్రమైనదని తేలింది. 

అయినప్పటికీ జంట టవర్ల సమీపంలోని రెండు హౌసింగ్ సొసైటీలలోని దాదాపు 5,000 మంది నివాసితుల తరలింపు పూర్తయిందని అధికారులు ఆదివారం ఉదయం తెలిపారు. ఎమరాల్డ్ కోర్టు, ఏటీఎస్ విలేజ్ సొసైటీల నివాసితులను తరలించామన్నారు. సెక్టార్ 93Aలోని రెండు సొసైటీలలో వంటగ్యాస్ మరియు విద్యుత్ సరఫరా కూడా నిలిపివేస్తామని తెలిపారు. నివాసితులతో పాటు, వారి వాహనాలు, పెంపుడు జంతువులను కూడా బయటకు తరలించినట్లు అధికారి తెలిపారు. 

కూల్చివేతకు పావు గంట ముందే  సమీపంలోని నోయిడా ఎక్స్ ప్రెస్ వేపై వాహనాల రాకపోకలను నిలిపివేస్తారు. భవనాలు కూలిన తర్వాత వచ్చే దుమ్ము తగ్గిన తర్వాత రహదారిని తిరిగి తెరుస్తారు. జంట టవర్ల సమీపంలో 560 మంది పోలీసు సిబ్బంది, 100 మంది రిజర్వ్ బలగాలు, 4 క్విక్ రెస్పాన్స్ టీమ్‌ లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. జంట టవర్ల సమీప ప్రాంతాల్లోకి ఎవ్వరూ రాకుండా ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు.
Go Back to Shorts
noida
twin towers
demolation

More Telugu News