Beheading: సోషల్ మీడియాలో నుపుర్ శర్మకు మద్దతు పలికాడని తల నరికివేత... ఉదయ్ పూర్ లో తీవ్ర ఉద్రిక్తత

  • మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ వ్యాఖ్యలు
  • ఇప్పటికీ వీడని ఆగ్రహజ్వాలలు
  • నుపుర్ పై పోస్టు షేర్ చేసిన టైలర్ కన్హయ్యా లాల్
  • తల నరికి వీడియో తీసిన వైనం
Man beheaded by two men in Udaypur

మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యల తాలూకు ప్రకంపనలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో రాజస్థాన్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. నుపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో షేర్ చేసిన వ్యక్తిని తల నరికి చంపారు. ఈ ఘటన ఉదయ్ పూర్ లోని మాల్దాస్ ప్రాంతంలో పట్టపగలు జరిగింది. ఈ హత్యలో ఇద్దరు వ్యక్తులు పాలుపంచుకున్నట్టు వెల్లడైంది. 

అంతేకాదు, ఆ వ్యక్తులు సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేసి, మోదీకి కూడా ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. 

మృతుడు కన్హయ్యా లాల్ టైలర్ గా పనిచేస్తున్నాడు. హంతకుల్లో ఒకరిని రియాజ్ గా గుర్తించారు. రియాజ్ ఓ పదునైన ఆయుధంతో కన్హయ్య లాల్ తల నరకగా, మరో వ్యక్తి ఈ ఘాతుకాన్ని మొబైల్ ఫోన్ ద్వారా వీడియో తీశాడు. ఈ హత్య వీడియో సోషల్ మీడియాలో కనిపించడంతో ఉదయ్ పూర్ లో ఇంటర్నెట్ నిలిపివేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. కన్హయ్యా లాల్ హత్యకు నిరసనగా స్థానిక మార్కెట్లను స్వచ్ఛందంగా మూసివేశారు. హంతకులను కఠినంగా శిక్షించాలని వ్యాపారులు డిమాండ్ చేశారు. 

ఈ ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పందించారు. ఉదయ్ పూర్ లో యువకుడి దారుణ హత్యను ఖండిస్తున్నట్టు తెలిపారు. ప్రజలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. ఈ ఘటన విషాదకరం అని పేర్కొన్నారు. ఇదేమీ చిన్న ఘటన కాదని, నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ఈ హత్య వీడియోను ఎవరూ షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
.

More Telugu News