తెలంగాణ విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది: రాహుల్ గాంధీ
- మూడో రోజూ కొనసాగిన ఆందోళనలు
- కాంగ్రెస్ శక్తిని తక్కువగా అంచనా వేయొద్దని రాహుల్ హితవు
- ఉద్యమ సమయంలో విద్యార్థులు ఎనలేని పాత్ర పోషించారన్న రాహుల్
12 ప్రధాన డిమాండ్ల పరిష్కారం కోసం బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు మూడు రోజులుగా నిరసనలు చేస్తున్నారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులకు మద్దతు ప్రకటించేందుకు వచ్చిన సీపీఐ నేత నారాయణను, నేతలను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులకు వ్యతిరేకంగా సీపీఐ నేతలు నినాదాలు చేశారు. ట్రిపుల్ ఐటీలోకి ఎస్ఎఫ్ఐ నేతలు దూసుకెళ్లడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. మరోవైపు, సీఎం కేసీఆర్ కానీ, మంత్రి కేటీఆర్ కానీ వచ్చి సమస్యలు పరిష్కరించే వరకు పోరాటాన్ని ఆపేది లేదని విద్యార్థులు తెగేసి చెబుతున్నారు.
విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ సతీశ్ కుమార్‌ను ఐటీ డైరెక్టర్‌గా నియమించింది. విద్యార్థుల సమస్యలను తాను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చినప్పటికీ విద్యార్థులు ససేమిరా అంటున్నారు. డైరెక్టర్ నియామకంతో సమస్యలు పరిష్కారం కావని, కేసీఆర్ లేదంటే కేటీఆర్ ఎవరో ఒకరు వచ్చే వరకు ఆందోళనలు కొనసాగుతాయని విద్యార్థులు తేల్చి చెప్పారు.