ప్రియుడు మోసం చేశాడంటూ ఆపిల్ ఎయిర్ టాగ్ సాయంతో వెంటాడి చంపిన యువతి

Woman killed boyfriend in Indianapolis
  • ఇండియానాపొలిస్ లో ఘటన
  • గైలిన్ మోరిస్, ఆండ్రే స్మిత్ ప్రేయసీప్రియులు
  • ప్రియుడు స్మిత్ పై గైలిన్ లో అనుమానం
  • ఎయిర్ టాగ్ సాయంతో స్మిత్ ఆచూకీ పట్టేసిన వైనం
  • మరో మహిళతో కనిపించిన స్మిత్
  • కారుతో తొక్కించేసిన గైలిన్
అమెరికాలో ఓ యువతి ప్రియుడు మోసం చేశాడంటూ అతడిని కిరాతకంగా అంతమొందించింది. ఇండియానాపొలిస్ లో ఈ ఘటన జరిగింది. ఆమె పేరు గైలిన్ మోరిస్. 26 ఏళ్ల గైలిన్ కొంతకాలంగా తన ప్రియుడు ఆండ్రే స్మిత్ పై కోపం పెంచుకుంది. ఇటీవల అతడు మరో స్త్రీతో కనిపించినప్పటి నుంచి భగ్గుమంటోంది. స్మిత్ తనను మోసం చేస్తున్నాడని భావించిన ఆ యువతి అతడ్ని ఈ లోకంలోనే లేకుండా చేయాలని తీవ్ర నిర్ణయం తీసుకుంది. 

దాంతో అతడి వస్తువులపై ఓ ఆపిల్ ఎయిర్ టాగ్ (చిన్న బటన్ వంటి పరికరం) ఫిక్స్ చేసింది. దాంతో అతడి ఆచూకీ ఆమెకి ఎప్పటికప్పుడు తెలిసిపోయేది. ఈ క్రమంలో ప్రియుడు ఆండ్రే స్మిత్ ఓ బార్ వద్ద ఉన్నాడని ఆపిల్ ఎయిర్ టాగ్ డేటా వెల్లడించడంతో, గైలిన్ ఆగ్రహంతో ఊగిపోతూ అక్కడికి వెళ్లింది. అతడితో పాటు మరో మహిళ కూడా కనిపించడంతో ఓ ఖాళీ వైన్ సీసాతో దాడికి దిగింది. 

అయితే బార్ సిబ్బంది జోక్యం చేసుకుని, వారు ముగ్గురు అక్కడి నుంచి వెళ్లిపోవాలని స్పష్టం చేశారు. ఆ తర్వాత ఆ బార్ ఎదుటే తన కారుతో అతడ్ని ఢీకొట్టి కడతేర్చింది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు పోలీసుల గైలిన్ మోరిస్ ను అరెస్ట్ చేశారు. 

ఇంతకీ గైలిన్ ఉపయోగించిన ఆపిల్ ఎయిర్ టాగ్ ఎలా పనిచేస్తుందంటే... ఇది ఓ జీపీఎస్ వంటిదే. దీన్ని ఆపిల్ ఫోన్, ఐపాడ్ వంటి సాధనాల ద్వారా నియంత్రించవచ్చు. ఈ ఎయిర్ టాగ్ ను ఏదైనా వస్తువుకు అంటిస్తే.... ఆ వస్తువును ఎక్కడున్నా ట్రేస్ చేయొచ్చు. 'ఫైండ్ మై' అనే యాప్ లో సదరు ఎయిర్ టాగ్ డేటా చూసుకోవచ్చు. గైలిన్ కూడా ప్రియుడిపై అనుమానంతో ఈ ఎత్తుగడనే అమలు చేసింది. ఎయిర్ టాగ్ కచ్చితంగా అతడిని పట్టివ్వడంతో ఆగ్రహం పట్టలేక అతడిని అక్కడికక్కడే కారుతో కసిగా మూడుసార్లు తొక్కించేసి చంపేసింది.
Go Back to Shorts
Gaylyn Morris
Andre Smith
Cheating
Apple Airtag
Indianapolis
USA

More Telugu News