తానే పార్వతినంటూ భారత్-చైనా సరిహద్దుల్లో సంచరిస్తున్న మహిళ... శివుడ్ని పెళ్లాడతానని వెల్లడి

Woman illegally resides at Indo china border
  • ఉత్తరాఖండ్ లో ఘటన
  • ఇటీవల లక్నో నుంచి హిమాలయాలకు వచ్చిన మహిళ
  • అనుమతులు ముగిసినా ఇంకా అక్కడే ఉన్న వైనం
  • పోలీసులనే బెదిరిస్తున్న మహిళ  
ఉత్తరప్రదేశ్ లోని లక్నోకు చెందిన ఓ మహిళ భారత్-చైనా సరిహద్దుల్లో అక్రమంగా నివసిస్తున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఆమె పేరు హర్మీందర్ కౌర్. తాను పార్వతీదేవినని, కైలాస పర్వతంపై కొలువున్న శివుడ్ని పెళ్లాడబోతున్నానని ఆమె చెబుతోంది. 

ఉత్తరాఖండ్ లోని నభిదాంగ్ ప్రాంతంలో నిషిద్ధ ప్రదేశంలో హర్మీందర్ కౌర్ ఉంటున్న విషయాన్ని గుర్తించిన పితోరాగఢ్ పోలీసులు ఆమెను అక్కడ్నించి ఖాళీ చేయించేందుకు ప్రయత్నించారు. అయితే, తనను బలవంతంగా తీసుకెళితే ఆత్మహత్య చేసుకుంటానని ఆమె బెదిరించింది. దాంతో వెనుదిరిగిన పోలీసులు, ఈసారి మరింత పెద్ద బృందంతో వెళ్లాలని నిర్ణయించారు. 

దీనిపై పితోరాగఢ్ జిల్లా ఎస్పీ లోకేంద్ర సింగ్ మాట్లాడుతూ, ఆమె ఉత్తరప్రదేశ్ లోని అలీగంజ్ ప్రాంతానికి చెందిన మహిళ అని వెల్లడించారు. హిమాలయాల్లోని గుంజీ ప్రాంతానికి 15 రోజుల క్రితం తన తల్లితో కలిసి వచ్చిందని, అందుకు ఆమెకు అనుమతులు కూడా ఉన్నాయని తెలిపారు. అయితే, ఆమె నిషిద్ధ ప్రాంతంలోకి అడుగుపెట్టడంతో పాటు, అనుమతించిన మేర గత నెల 25తో కాలపరిమితి పూర్తయిందని వివరించారు. దాంతో ఆమెను ఖాళీ చేయిస్తున్నామని వివరించారు. 

ఇద్దరు ఎస్సైలు, ఓ ఇన్ స్పెక్టర్ తో ఒక పోలీసు బృందాన్ని పంపిస్తే ఆమె తిరిగొచ్చేందుకు ససేమిరా అంటోందని, ఈసారి 12 మందితో పెద్ద బృందాన్ని పంపిస్తామని, ఆమెను నిషేధిత ప్రాంతం నుంచి వెలుపలికి తీసుకువస్తామని ఎస్పీ లోకేంద్ర సింగ్ వెల్లడించారు. తానే పార్వతీదేవినంటూ చెప్పుకోవడం చూస్తుంటే ఆమె మానసిక స్థితి సరిగా లేదన్న విషయం అర్థమవుతోందని తెలిపారు.
Go Back to Shorts
Woman
Parvathi
Lord Shiva
Uttarakhand
Himalayas
Uttar Pradesh

More Telugu News