Supreme Court: టెన్త్‌, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల ర‌ద్దుకు సుప్రీం తిర‌స్క‌ర‌ణ‌

  • ఆఫ్‌లైన్ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని విద్యార్థుల పిటిష‌న్‌
  • జ‌స్టిస్ ఖాన్విల్క‌ర్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం విచార‌ణ‌
  • పిటిష‌న్‌ను కొట్టేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన న్యాయ‌మూర్తి
  • ఈ పిటిష‌న్లు సంప్ర‌దాయం కాకూడ‌ద‌ని ఉద్బోధ‌
Supreme Court strikes down petition for cancellation of offline exams

క‌రోనా కార‌ణంగా టెన్త్‌, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ దాఖ‌లైన పిటిష‌న్‌ను స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు తిర‌స్క‌రించింది. ఈ త‌ర‌హా పిటిష‌న్లు విద్యార్థుల‌ను అయోమ‌యానికి గురి చేస్తాయ‌ని, అంతేకాకుండా ఈ త‌ర‌హా పిటిష‌న్లు విద్యా వ్య‌వ‌స్థ‌లో గంద‌ర‌గోళాన్ని సృష్టిస్తాయ‌ని కూడా కోర్టు అభిప్రాయ‌ప‌డింది.

విద్యార్థుల్లో త‌ప్పుడు విశ్వాసాన్ని క‌ల‌గ‌జేసే ఈ త‌ర‌హా పిటిష‌న్లు సంప్ర‌దాయంగా మార‌కూడ‌ద‌ని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. క‌రోనా నేప‌థ్యంలో సీబీఎస్ఈ స‌హా ఇత‌ర బోర్డులు ఆఫ్‌లైన్‌లో నిర్వ‌హించ‌నున్న టెన్త్‌, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ ప‌లు రాష్ట్రాల‌కు చెందిన విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

ఈ పిటిష‌న్‌పై సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఖాన్విల్క‌ర్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం విచార‌ణ చేపట్టింది. ఈ త‌ర‌హా పిటిష‌న్లు విద్యార్థుల‌ను త‌ప్పు దోవ ప‌ట్టించే ప్ర‌మాద‌ముంద‌ని న్యాయ‌మూర్తి వ్యాఖ్యానించారు. విద్యార్థుల‌తో పాటు విద్యా వ్య‌వ‌స్థ‌లోనే గంద‌ర‌గోళాన్ని సృష్టించే ఈ త‌ర‌హా పిటిష‌న్లు ఇక‌పై సంప్ర‌దాయం కాకూడ‌ద‌న్న భావ‌న‌తోనే ఈ పిటిష‌న్‌ను తోసిపుచ్చుతున్న‌ట్లుగా ఆయ‌న పేర్కొన్నారు. ప‌రీక్ష‌ల‌కు సంబంధించి ఇప్ప‌టికే బోర్డులు షెడ్యూల్‌ను ప్ర‌క‌టించే క‌స‌ర‌త్తులు చేస్తున్నాయ‌ని, షెడ్యూల్‌లో ఏవైనా స‌మ‌స్య‌లుంటే ఆయా బోర్డుల అధికారుల‌ను సంప్ర‌దించాల‌ని న్యాయ‌మూర్తి సూచించారు.

More Telugu News