ఉద్యోగులకు సీసీఏను పునరుద్ధరించిన ఏపీ ప్రభుత్వం
- జనవరి 17న సీసీఏను రద్దు చేసిన ప్రభుత్వం
- ఉద్యోగుల ఉద్యమంతో దిగివచ్చిన సర్కారు
- సీసీఏను పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ
- జనవరి 1 నుంచే అమల్లోకి
ఉద్యోగ సంఘాలు ఏకతాటిపైకి వచ్చి పీఆర్సీ సాధన సమితిగా ఏర్పడి ఉద్యమం చేయడంతో ప్రభుత్వం చర్చలు జరిపింది. రద్దు చేసిన సీసీఏను పునరుద్ధరించేందుకు అంగీకరించింది. మంత్రుల కమిటీ హామీ మేరకు గత ఉత్తర్వులను సవరించారు. ఉద్యోగులకు వారి పే ఆధారంగా సీసీఐ వర్తిస్తుంది. అయితే, ఏపీ ఉన్నత జుడీషియల్ సర్వీసెస్, రాష్ట్ర జుడీషియల్ సర్వీసెస్ వారికోసం ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేస్తారు.
సవరించిన వేతనం ఆధారంగా రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల ఉద్యోగులు, విశాఖపట్టణం, విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో పనిచేసే ఉద్యోగులు, అనంతపురం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, తిరుపతి నగరాల్లో పనిచేసే వారికి మూడు కేటగిరీల్లో సీసీఏ చెల్లిస్తారు.