ఒక్క రోజు కూడా కాకుండానే నుమాయిష్ మూత.. అప్పటికప్పుడు పదివేల మంది బయటకు!
- కరోనా కేసులు పెరుగుతుండడంతో అధికారుల నుంచి ఆదేశాలు
- సందర్శకులు బయటకు వెళ్లిపోవాల్సిందిగా మైకుల ద్వారా ప్రకటన
- ఉసూరుమంటూ వెనుదిరిగిన వేలాదిమంది
పోలీసు అధికారుల నుంచి అందిన ఆదేశాలతో తొలుత టికెట్ బుకింగ్ కౌంటర్లను మూసేశారు. ఆ తర్వాత యజమానులు స్టాళ్లను మూసివేశారు. లోపల ఉన్న సందర్శకులు వెళ్లిపోవాల్సిందిగా మైకుల ద్వారా ప్రకటించారు. నుమాయిష్ సందర్శనకు ఆనందంగా వచ్చిన సందర్శకులు ఈ ప్రకటనతో నిరాశగా వెనుదిరిగారు.
రాష్ట్రవ్యాప్తంగా జనవరి 10 వరకు సామూహిక సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిషేధిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీచేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో జనవరి 10వ తేదీ వరకు నుమాయిష్-2022ను నిలిపివేయాలని సొసైటీ నిర్ణయించిందని, ఆ తర్వాతి పరిస్థితిని బట్టి నుమాయిష్‌ను కొనసాగించాలా? వద్దా? అన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి అశ్విన్ మార్గం తెలిపారు.