ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఈటల జమున ఫైర్

Etela Jamuna fires on KCR
  • కేసీఆర్ కుటుంబం ఉద్యమం చేస్తే తెలంగాణ రాలేదు
  • రాష్ట్ర సాధన కోసం ముగ్గురు ఆంధ్ర సీఎంలతో ఈటల కొట్లాడారు
  • ఈటలకు మద్దతు పలుకుతున్న వారికి బెదిరింపులు వస్తున్నాయి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ భార్య ఈటల జమున నిప్పులు చెరిగారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంక మండలం దేశాయిపల్లి గ్రామంలో ఈరోజు ఆమె ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, హుజూరాబాద్ ఉద్యమాల గడ్డ అని అన్నారు. కేసీఆర్ కుటుంబం ఉద్యమం చేస్తే తెలంగాణ రాలేదని... శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్యలాంటి వారి ప్రాణాల త్యాగం వల్ల వచ్చిందని చెప్పారు. రాష్ట్ర సాధన కోసం ముగ్గురు ఆంధ్ర ముఖ్యమంత్రులతో ఈటల కొట్లాడారని అన్నారు.

ఈటల రాజేందర్ కు మద్దతు పలుకుతున్న వారికి బెదిరింపులు వస్తున్నాయని జమున మండిపడ్డారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చినప్పుడే ముఖ్యమంత్రికి ఉద్యోగాలు గుర్తుకొస్తాయని విమర్శించారు. గతంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు ఇంత వరకు డబ్బులు ఇవ్వలేదని... కానీ, ఇప్పుడు రాత్రికి రాత్రే రోడ్లు వేస్తున్నారని అన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక కోసమే ఇదంతా చేస్తున్నారని అన్నారు. ఇతర నియోజకవర్గాల్లో రేషన్ కార్డులు, పెన్షన్లు, దళితబంధు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
Go Back to Shorts
Etela Jamuna
Etela Rajender
BJP
KCR
TRS

More Telugu News