ఆఫ్ఘన్ మహిళకు ప్రసవపు నొప్పులు రావడంతో హుటాహుటీన అమెరికా విమానం ల్యాండింగ్
- దేశాన్ని వీడుతున్న ఆఫ్ఘన్లు
- తాలిబన్ పాలన పట్ల భయాందోళనలు
- అమెరికా సైనిక విమానం ఎక్కిన ఆఫ్ఘన్ మహిళ
- పండంటి ఆడశిశువుకు జననం
అప్పటికే విమానం గాల్లో 28 వేల అడుగుల ఎత్తున ప్రయాణిస్తోంది. విమానంలో పీడనం తక్కువగా ఉండడంతో ఆమె తీవ్ర ఇబ్బందికి గురైంది. దాంతో ఆ ఫ్లయిట్ కమాండర్ సమయస్ఫూర్తితో స్పందించి విమానాన్ని తక్కువ ఎత్తుకు తీసుకురావాలని నిర్ణయించారు. దాంతో విమానంలో పీడనం సాధారణ స్థితికి చేరుకుంది.
అనంతరం ఆ సీ-17 విమానాన్ని జర్మనీలోని అమెరికా వాయుసేనకు చెందిన రామ్ స్టీన్ ఎయిర్ బేస్ లో దించారు. అప్పటికే సమాచారం అందించడంతో, ఆరోగ్య బృందం సిద్ధంగా ఉంది. ఆ మహిళకు సకాలంలో వైద్య చికిత్స అందించడంతో పండంటి ఆడశిశువుకు జన్మనిచ్చింది. ఆపై తల్లీబిడ్డలను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, వారిరువురు ఆరోగ్యంగా ఉన్నట్టు అమెరికా సైనిక వర్గాలు తెలిపాయి.