తిరిగి టీఎంసీవైపు చూస్తున్న ముకుల్ రాయ్ సహా 35 మంది బీజేపీ నేతలు!

On Mukul Roys Return A Heavy Hint From Trinamool MP
  • 35 మంది నేతలలో 20 మంది ఎమ్మెల్యేలు
  • పార్టీ మారిన నేతలను రెండు కేటగిరీలుగా విభజించిన మమత
  • మొదటి కేటగిరిలో ముకుల్ రాయ్.. రెండో దాంట్లో సువేందు
చూస్తుంటే పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి భారీ ఎదురుదెబ్బలు తగిలేలా కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాషాయ తీర్థం పుచ్చుకున్న పలువురు నేతలు తిరిగి టీఎంసీ గూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరిలో బీజేపీ కీలక నేత ముకుల్ రాయ్ సహా 35 మంది నేతలు ఉన్నట్టు సమాచారం. నాలుగేళ్ల క్రితమే బీజేపీలో చేరిన ముకుల్ రాయ్ టీఎంసీవైపు చూస్తున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. టీఎంసీ వైపు చూస్తున్న 35 మందిలో 20 మంది ఎమ్మెల్యేలు ఉండడం గమనార్హం.

పార్టీని వీడి కాషాయ కండువా కప్పుకున్న వారు తిరిగి మమత కరుణా కటాక్షాల కోసం చూస్తున్నప్పటికీ ఆమె మాత్రం ఈ విషయంలో కొంత కఠినంగానే ఉండాలని, అందరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని అనుకోవడం లేదని టీఎంసీ వర్గాలు చెబుతున్నాయి. ఎవరెవరిని చేర్చుకోవాలనే దానిపై మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి ఓ ఫార్ములాను ఆమె సూచించారని చెబుతున్నారు. ఇందులో భాగంగా పార్టీలోకి రావాలనుకుంటున్న వారిని రెండు కేటగిరీలుగా విభజించారు.

పార్టీ మారినప్పటికీ మమతపై ఎలాంటి విమర్శలు చేయకుండా వివాదరహితులుగా ఉన్నవారు మొదటి కేటగిరీలోకి, పార్టీ మారాక మమతపై విరుచుకుపడిన వారు రెండో కేటగిరీలోకి వస్తారు. ఈ రకంగా చూసుకుంటే ముకుల్ రాయ్ మొదటి కేటగిరిలోకి, బీజేపీ తీర్థం పుచ్చుకున్నాక తీవ్ర విమర్శలు చేసిన సువేందు అధికారి రెండో కేటగిరీలోకి వస్తారు.

మమతతో అత్యంత సన్నిహితంగా మెలిగిన ముకుల్ రాయ్ 2017లో బీజేపీ గూటికి చేరారు. అప్పటి నుంచి బీజేపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రతిపక్షంగా అవతరించిన తర్వాత తనను ప్రతిపక్ష నేతను చేస్తారని ముకుల్ రాయ్ భావించారు. అయితే ఎన్నికలకు కొన్ని వారాల ముందు బీజేపీలో చేరిన సువేందు అధికారికి అధిష్ఠానం ఆ అవకాశం కల్పించింది. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న ముకుల్ రాయ్ ఇటీవల నిర్వహించిన పార్టీ ముఖ్యనేతల సమావేశానికి కూడా హాజరు కాకపోవడం పలు ఊహాగానాలకు తావిచ్చింది.
Go Back to Shorts
West Bengal
Mamata Banerjee
Mukul Roy
TMC
BJP

More Telugu News