సాయం కావాలంటూ కరోనా కాల్ సెంటర్ కు వచ్చే ఫోన్లు తగ్గాయి: ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఏకే సింఘాల్

AK Singhal explained how AP revives from corona second wave
  • ఏపీలో కరోనా తగ్గుముఖం పడుతోందన్న సింఘాల్
  • 1.06 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చామని వెల్లడి
  • 45 ఏళ్లు పైబడిన వారిలో సగం మందికి ఒక డోసు ఇచ్చినట్టు వివరణ
  • పిల్లలకు కరోనాపై అధ్యయనం జరుగుతోందని వెల్లడి
ఏపీలో కరోనా పరిస్థితులపై రాష్ట్ర ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ మీడియాకు వివరాలు తెలిపారు. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి క్రమంగా తగ్గుతోందని వెల్లడించారు. సాయం కావాలంటూ కాల్ సెంటర్ కు వచ్చే ఫోన్ కాల్స్ సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోందని వివరించారు. వివిధ ఆసుపత్రుల్లో 406 టన్నుల ఆక్సిజన్ వినియోగం జరిగిందని చెప్పారు. రాష్ట్రంలో 1,460 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని సింఘాల్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన 11వ విడత ఫీవర్ సర్వే పూర్తయిందని అన్నారు.

ఇక, వ్యాక్సినేషన్ పై వివరణ ఇస్తూ, ఇప్పటివరకు 1.06 కోట్ల మందికి రెండు డోసుల వ్యాక్సిన్ ఇచ్చామని వెల్లడించారు. 45 ఏళ్లు దాటినవారిలో 50 శాతం మందికి ఒక డోసు పూర్తయిందని తెలిపారు. పిల్లలకు కరోనా సోకడంపై టాస్క్ ఫోర్స్ కమిటీ అధ్యయనం చేస్తుందని చెప్పారు. థర్డ్ వేవ్ లో జన్యుఉత్పరివర్తనాలతో కూడిన కరోనా వేరియంట్ల కారణంగా పిల్లలు హైరిస్క్ గ్రూపులో ఉంటారని వెల్లడించారు. 1, 2వ వేవ్ లో ఎందరు పిల్లలకు కరోనా వచ్చిందో చూసి మూడో వేవ్ పై అంచనా వేస్తామని తెలిపారు. 18 ఏళ్లు దాటిన వారికి కనీసం ఒక్క డోసైనా వ్యాక్సిన్ పూర్తవుతుందని భావిస్తున్నామని అన్నారు.

కారంచేడు వైద్యుడు భాస్కరరావు కొవిడ్ చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొన్నారు. చికిత్సకయ్యే ఖర్చును సీఎం జగన్ విడుదల చేశారని సింఘాల్ వెల్లడించారు.

అటు, నెల్లూరు జీజీహెచ్ లో వైద్య విద్యార్థినిపై లైంగిక వేధింపుల కేసు విచారణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. జిల్లా అధికారుల కమిటీతో పాటు వైద్య కళాశాల ప్రిన్సిపల్ కమిటీ కూడా విచారణ చేపడుతుందని వివరించారు. ఈ రెండు కమిటీల నివేదికలు సోమవారంలోగా అందే అవకాశముందని, నివేదికల్లోని అంశాలను పరిశీలించాకే ఏ చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తామని చెప్పారు.
Go Back to Shorts
AK Singhal
Corona Virus
Second Wave
Andhra Pradesh
Jagan

More Telugu News