Corona Virus: ప్రపంచవ్యాప్తంగా వివిధ కరోనా టీకాల ధరలు ఇలా ఉన్నాయి!

  • ఫైజర్ బయోఎన్‌టెక్‌ ఒక్కోడోసు 14.70-30 డాలర్లు
  • మోడెర్నా ఒక్కో డోసు 25-37 డాలర్లు
  • స్పుత్నిక్‌, జాన్సన్‌ ఒక్కో డోసు పది డాలర్లు
  • కొవిషీల్డ్‌ రూ.200, కొవాగ్జిన్‌ రూ.206
world wide corona vaccine prices are like this

దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో 18 ఏళ్లు నిండిన వారందరికీ టీకా అందించేందుకు కేంద్రం అనుమతించిన విషయం తెలిసిందే. అయితే, దేశీయంగా టీకాల కొరత ఉండడంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వివిధ దేశాల్లో అందుబాటులోకి వచ్చిన కరోనా టీకాల ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

ఫైజర్‌-బయోఎన్‌టెక్‌

ఎంఆర్‌ఎన్‌ఏ సాంకేతికత ఆధారంగా ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ సంయుక్తంగా రూపొందించిన టీకాయే బీఎన్‌టీ162బీ2. అమెరికాలో దీని ధర ఒక్కో డోసుకు 19.50 డాలర్లు. ఈ టీకా అభివృద్ధికి ఆర్థిక సహకారం అందించిన ఐరోపా సమాఖ్యకు దీన్ని ఒక్కో డోసును 14.70 డాలర్లకు అందిస్తున్నారు. ఇజ్రాయెల్‌ ఏకంగా ఒక్కో డోసుకు 30 డాలర్లు చెల్లిస్తోంది. ప్రస్తుతం ఈ టీకాను యూకే, అమెరికా, కెనడా, జపాన్‌ సహా మరికొన్ని దేశాలు వినియోగిస్తున్నాయి.

మోడెర్నా

అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న మోడెర్నా సంస్థ రూపొందించిన ఎంఆర్‌ఎన్‌ఏ-1273 టీకాపై అమెరికా ప్రభుత్వం రాయితీ కల్పించింది. అయినప్పటికీ దీని ధర ఒక్కో డోసుకు 25-37 డాలర్ల మధ్య ఉంది. ప్రస్తుతం దీనిని యూకే, అమెరికా, కెనడా, ఇజ్రాయెల్‌లో వినియోగిస్తున్నారు.

స్పుత్నిక్‌-వి

రష్యా అభివృద్ధి చేసిన ఈ టీకా వినియోగానికి భారత్‌లో కూడా అనుమతి లభించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 60 దేశాలు ఈ టీకా వినియోగానికి ఆమోదం తెలిపాయి. దీని ధర ఒక్కో డోసుకు పది డాలర్లు లేదా రూ.750గా ఉంది.

జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌

ఇది ఒకే డోసు టీకా. దీన్ని 2-8 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సి ఉంటుంది. దీని ధరను కూడా పది డాలర్లు లేదా రూ.750గా నిర్ణయించారు. ఐరోపా సమాఖ్య దీనికి 8.50 డాలర్లు చెల్లిస్తోంది.

కొవిషీల్డ్‌

ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్‌ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌ టీకాను భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. 28 రోజుల వ్యవధిలో రెండు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రస్తుతం దీన్ని ఒక్కో డోసును రూ.200కు అందిస్తున్నారు. ఐరోపా సమాఖ్య 2.15 డాలర్లు చెల్లిస్తుండగా.. దక్షిణాఫ్రికా 5.25 డాలర్లు వెచ్చిస్తోంది.

కొవాగ్జిన్‌

దేశీయంగా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ, ఐసీఎంఆర్‌ సహకారంతో భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ ధర ఒక్కో డోసుకు రూ.206గా ఉంది.  ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో కొవిషీల్డ్‌తో పాటు ఈ టీకాను కూడా ఉపయోగిస్తున్నారు.

More Telugu News