Vijay Kumar Reddy: 40 రోజుల హోటల్ బిల్లు రూ. 40 లక్షలేనట... స్మృతి సింహ మామూలు కి'లేడీ' కాదట!

  • 5వ తేదీన విజయ్ అనే యువకుడి సూసైడ్
  • కేసును విచారిస్తుంటే విస్తుపోయే నిజాలు
  • వీరారెడ్డిని రూ. 11.50 కోట్లకు ముంచిన జంట
  • భయపడి ఆత్మహత్య చేసుకున్న విజయ్
Police Enquiry on Duplicate IPS Smruthi

కడప ప్రాంతానికి చెందిన విజయ్ కుమార్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడిన తరువాత, విచారణ ప్రారంభించిన పోలీసులు, ఐపీఎస్ అధికారిణిగా మోసాలకు పాల్పడుతున్న స్మృతి సింహ అన్ని బాగోతాలనూ వెలికితీశారు. వీరిద్దరూ కలసి ఎంతో మందిని మోసం చేశారని ఇప్పటికే తేల్చిన పోలీసులు, తాజాగా తమ ఎంక్వయిరీలో విస్తుపోయే వాస్తవాలను కనుగొన్నారు. వీరారెడ్డి అనే వ్యాపారిని మాయమాటలు చెప్పి మోసం చేసి రూ. 11.50 కోట్లు తీసుకున్న వీరిద్దరూ ఆ డబ్బుతో అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడిపారని తేల్చారు.

వీరారెడ్డి నుంచి ఒత్తిడి రావడంతోనే విజయ్ కుమార్ రెడ్డి, ఏం చేయాలో తెలియక ఓ వాయిస్ మెసేజ్ ని పెట్టి, ఆత్మహత్య చేసుకున్నాడని, దాని ఆధారంగానే కేసు విచారణను ముందుకు సాగించామని పోలీసులు తెలిపారు. ఈ కేసులో స్మృతి సింహ అత్యంత కీలకమని, విజయ్ తో కలసి ఆమె తిరిగిందని పోలీసు వర్గాలు అంటున్నాయి. ఇద్దరూ కలసే అన్ని మోసాలూ చేశారని, వారికి కుటుంబీకులు కూడా సహకరించారని తేల్చాయి.

ఇక తాము సంపాదించిన అక్రమ సంపాదనతో వీరు అనుభవించిన లగ్జరీ లైఫ్ వివరాలను కూడా పోలీసు వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ లోని స్టార్ హోటల్ పేరు చెబితే రోజుకు కనీసం రూ. 10 వేల అద్దె గుర్తుకు వస్తుంది. అటువంటి స్టార్ హోటల్లో మామూలు వాళ్లు కనీసం ఆలోచించేందుకు కూడా వీల్లేని ప్రత్యేక గది వీరి సొంతం. అత్యంత సంపన్నులు వస్తేనే మాత్రమే తెరిచే ఆ గదిని వీరికి సదరు హోటల్ కేటాయించింది.

రోజుకు అద్దె రూ. 50 వేలయితే, మరో రూ. 50 వేలు ఖర్చు... మొత్తం మీద 40 రోజులు అదే హోటల్ లో మకాం వేసిన విజయ్ కుమార్ రెడ్డి, స్మృతి సింహ అలియాస్ శిరీష, రూ. 40 లక్షలు బిల్లు చేశారు. హోటల్ వారికి విజయ్ ఐపీఎస్ అధికారని, శిరీష మానవ హక్కుల సంఘం చైర్ పర్సన్ అని మాత్రమే తెలుసు. ఇక తాను మోసం చేసి తెచ్చిన డబ్బుతో బంధు మిత్రులకు డబ్బులు, చిన్న చిన్న కానుకలు ఇవ్వడంతో పాటు రూ. 1.8 కోట్లతో బీఎండబ్లూ కారు, ఆపై రూ. 1.70 కోట్లతో ఇంకో కారు, రూ. 70 లక్షలతో మరో కారును కొన్నాడు. ప్రియురాలి పుట్టిన రోజు వస్తే రూ. 50 లక్షల కానుకలు ఇచ్చాడు.

అంతేకాదు విశాఖపట్నానికి వెళ్లి ఎనిమిది రోజులు మరో లగ్జరీ హోటల్ లో అంతే లగ్జరీగా గడిపి వచ్చాడు. ఓ విల్లాను కొనేందుకు రూ. 70 లక్షలు చెల్లించాడు. ఎవరైనా తనను డబ్బు అడిగితే వెంటనే సాయం చేశాడు. తక్కువ మొత్తమైతే తిరిగి అడిగేవాడు కాదట. దీంతో బంధువులకు వీరిద్దరిపై ఎంతో నమ్మకం పెరిగి, వారికి పూర్తిగా సహకరించారు. స్మృతితో కలసి విజయ్ తిరుగుతుంటే ఇద్దరిదీ చూడముచ్చటైన జంటని కితాబిచ్చారు కూడా.

ఆపై స్మృతి సింహా అసలు స్వరూపం బయటకు వచ్చింది. విజయ్ తో చాలా తెలివిగా డ్రామాలాడించిన ఆమె పూర్తిగా ఇరికించడంతో, ఏం చేయాలో తెలియని విజయ్ సూసైడ్ మెసేజ్ పెట్టి చనిపోయాడు. శిరీష తనను మోసం చేసిందని, తనను క్షమించాలని చెబుతూ వాయిస్ రికార్డును వీరారెడ్డికి పంపి, ఈనెల 5న విజయ్ సూసైడ్ కు పాల్పడగా, ఈ కేసులో ఇంతవరకూ నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కేసులో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న నిజాలను చూసి విస్తుపోతున్నారు.

More Telugu News