కేంద్ర ఉద్యోగులంతా విధులకు హాజరు కావాల్సిందేనని ఆదేశాలు!

All Central Govt Employees Must Attened Offices
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా వీక్ డేస్ లో తప్పనిసరిగా తమతమ కార్యాలయాల్లో విధులకు హాజరు కావాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు సిబ్బంది మంత్రిత్వ శాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. కరోనా కేసులు పెరుగుతూ, లాక్ డౌన్ అమలులోకి వచ్చిన వేళ, ఉద్యోగులు ఆఫీసులకు హాజరు కాకుండా సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడిక కొత్త కేసుల సంఖ్య కనిష్ఠానికి పడిపోవడంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

ఇదే సమయంలో కంటెయిన్ మెంట్ జోన్లలో నివాసం ఉంటున్న అధికారులు, ఉద్యోగులకు మాత్రం సడలింపులు కొనసాగుతాయని, ఆయా ప్రాంతాలు డీ నోటిఫైడ్ అయ్యేంత వరకూ అక్కడి వారు విధులకు హాజరు కావాల్సిన అవసరం లేదని కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది. వీరు అధికారుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ కు అందుబాటులో ఉండాలని సూచించింది. సమావేశాలకు సైతం వీరు వీడియో కాన్ఫరెన్స్ విధానంలో హాజరు కావాలని ఆదేశించింది. ఇప్పటివరకూ కార్యదర్శి, ఆపై స్థాయి అధికారులు మాత్రమే కార్యాలయాలకు వస్తున్నారు. డిప్యూటీ సెక్రటరీ స్థాయి, ఆ దిగువ స్థాయి అధికారులు ఇంటి నుంచే పని చేస్తున్నారు.

ఇక ఆఫీసుల్లో రద్దీ అధికం కాకుండా ఉద్యోగులకు వివిధ రకాల టైమ్ స్లాట్ లను నిర్ధారించుకోవాలని, వాటి ప్రకారం, అందరు అధికారులూ వీక్ డేస్ లో ఆఫీసులకు రావాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. ఈ విషయంలో ఏ కేటగిరీ వారికి కూడా మినహాయింపులు ఉండబోవని పేర్కొంది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకూ బయో మెట్రిక్ అటెండెన్స్ ను మాత్రం తప్పనిసరి చేయబోవడం లేదని వెల్లడించింది.
Go Back to Shorts
Employees
Corona Virus
Office
Attendence Must

More Telugu News