50 ఏళ్లలో 71 శాతం తగ్గిపోయిన సొరచేపలు.. అంతర్థానం దిశగా 24 జాతులు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

50 ఏళ్లలో 71 శాతం తగ్గిపోయిన సొరచేపలు.. అంతర్థానం దిశగా 24 జాతులు!

Oceanic shark populations dropped 71percent since 1970
  • సముద్రాల్లో భారీగా పెరిగిన ఉద్దేశపూర్వక వేట
  • షార్క్ ల ప్రత్యుత్పత్తి దశకు చాలా సమయం
  • వాటికి సంతానమూ తక్కువే
  • వేట తోడవడంతో అంతరించే స్థితిలో సొర చేపలు
ఎంత దూరంలో ఉన్నా సరే.. దేన్నైనా ఇట్టే పసిగట్టేస్తాయి సొర చేపలు (షార్క్ లు). వాసన, సముద్ర ప్రవాహాల్లో తేడాలను బట్టి గుర్తించేస్తాయి. కానీ, తమకు వస్తున్న ఆపదను మాత్రం అవి పసిగట్టలేకపోతున్నాయి. గుర్తించేలోపు బలైపోతున్నాయి. 1970 నుంచి 50 ఏళ్లలో 71 శాతం సొర చేపల సంఖ్య తగ్గిపోయిందంటే.. ఎంత ఎక్కువగా వాటిని వేటాడేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

ప్రపంచంలోని మహాసంద్రాల్లో ఉన్న షార్క్ ల లెక్కలపై అమెరికాలోని స్క్రిప్స్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఓషనోగ్రఫీ, కెనడాలోని సైమన్ ఫ్రేసర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అధ్యయనం నిర్వహించారు. 57 డేటా సెట్లను పరిశీలించారు. 31 జాతుల్లో 24 జాతులు దాదాపు అంతర్థానం అయ్యే దుస్థితి ఏర్పడిందని హెచ్చరించారు. వైట్ టిప్ షార్క్, సుత్తితల షార్క్, భారీ సుత్తి తల షార్క్ అనే మరో మూడు జాతులైతే అంతర్థానానికి అంచుల్లో ఉన్నాయని తేల్చి చెప్పారు.

1950 నుంచి సముద్రాల్లో చేపల వేట బాగా పెరిగిందని, అప్పటి నుంచి చేపల వేటకు వెళ్లే బోట్లు, మర పడవలు రెట్టింపయ్యాయని పరిశోధకులు అధ్యయనంలో తేల్చారు. చేపల వేట కన్నా షార్క్ ల వేట ఎక్కువైపోయిందని చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే సొర చేపలను వేటాడుతున్నా.. ట్యూనా, స్వార్డ్ ఫిష్ లను వేటాడేటప్పుడు అప్రయత్నంగానే అవి వలల్లో పడుతున్నట్టు చేపల వేట కంపెనీలు బుకాయిస్తున్నాయని పరిశోధకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇతర చేప జాతులు, జంతువులతో పోలిస్తే షార్క్ లు ప్రత్యుత్పత్తి దశకు చేరాలంటే చాలా ఏళ్లు పడుతుందని, వాటికి సంతానమూ చాలా తక్కువే ఉంటుందని అంటున్నారు. వేట పెరిగిపోవడం, వాటి సంతాన రేటు తగ్గడం వల్ల షార్క్ జాతులు అంతరించే ప్రమాదంలో పడ్డాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అడవుల్లో సింహాలు, పులుల్లాగానే సంద్రాల్లో షార్కులు కూడా అలాంటివేనని డ్యూక్ యూనివర్సిటీ పర్యావరణ వేత్త స్టువర్ట్ పిమ్ అన్నారు. వాటిని కాపాడుకుంటేనే జీవ వైవిధ్యం మెరుగ్గా ఉంటుందని, పర్యావరణ వ్యవస్థ సమతుల్యమవుతుందని చెప్పారు. షార్క్ లను అతిగా వేటాడం వల్ల సముద్రంలోని ప్రతి ఆహార వ్యవస్థపైనా ప్రభావం పడుతుందని హెచ్చరించారు.
Shark
Oceans

More Telugu News