Sathi Suryanarayana Reddy: సవాల్ కు ప్రతి సవాల్... సత్యప్రమాణం చేసేందుకు బిక్కవోలు ఆలయానికి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే, టీడీపీ మాజీ ఎమ్మెల్యే

  • అనపర్తిలో సత్తి సూర్యనారాయణరెడ్డి వర్సెస్ రామకృష్ణారెడ్డి
  • అవినీతిపై పరస్పర ఆరోపణలు
  • దైవం ముందు ప్రమాణం చేస్తానన్న సూర్యనారాయణరెడ్డి
  • సవాల్ స్వీకరించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి
  • అప్రమత్తమైన పోలీసులు
YCP MLA and TDP Former MLA comes to Bikkavolu Ganapathi Temple

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి శాసనసభ్యుడు సత్తి సూర్యనారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మధ్య విమర్శల పర్వం పతాకస్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు చేసుకున్న ఈ నేతలు తమ వ్యాఖ్యలపై బిక్కవోలు లక్ష్మీగణపతి ఆలయంలో సత్యప్రమాణం చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రమాణం చేసి నిజాయతీ నిరూపించుకోవాలని పరస్పరం సవాళ్లు విసురుకున్నారు.

ఈ మధ్యాహ్నం 2.30 గంటలకు గణపతి ఆలయంలో సత్యప్రమాణానికి వస్తానని, దేవుడి ముందు తానేంటో నిరూపించుకుంటానని వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి సవాల్ చేయగా, టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆ సవాల్ ను స్వీకరించారు.

కాగా, ఈ ఇద్దరు నేతల సత్యప్రమాణానికి పోలీసుల నుంచి అనుమతి లభించడంతో రాజకీయం రంజుగా మారింది. అయితే, పోలీసులు బిక్కవోలులో 144 సెక్షన్ విధించారు. పోలీసు నిబంధనలు అమల్లో ఉన్నందున నేతలు తమ వెంట ఎవరినీ తీసుకురావొద్దని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ఇద్దరు నేతలు బిక్కవోలు లక్ష్మీగణపతి ఆలయానికి చేరుకోవడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.

More Telugu News