కేసీఆర్ పై మరోసారి విమర్శలు గుప్పించిన విజయశాంతి

Vijayashanthi fires on KCR
  • దేశమంతా చులకనగా చూసే స్థాయికి టీఆర్ఎస్ ప్రభుత్వం దిగజారిపోయింది
  • నీటి వాటా సాధించడంలో సర్కారు విఫలమైంది
  • కేసీఆర్ తీసుకొచ్చిన ధరణి వెబ్ సైటు చుక్కలు చూపిస్తోంది
టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా ఉందని... దేశమంతా చులకనగా చూసే స్థాయికి ప్రభుత్వం దిగజారి పోయిందని బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శించారు. సీఎం కేసీఆర్ దొరగారు ఉద్యమకాలంలోను, ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు పిట్టలదొర కబుర్లే తప్ప... వాటిలో చిత్తశుద్ధి ఏ మాత్రం లేదని తేలిపోయిందని అన్నారు.

కేసీఆర్ దొరవారి హామీతో సన్న వడ్లు పండించిన పాపానికి మద్దతు ధర సైతం దక్కని పరిస్థితుల్లో ఆ రైతులు తమ పంటను పక్క రాష్ట్రాలకు అమ్ముకుని బతకాల్సి వచ్చిందని చెప్పారు. వీరికి తోడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొనుగోళ్ళు లేక మక్క రైతులు రోడ్డుకెక్కారని, అన్నదాతలు తమ పంటలకు మంట పెట్టుకున్నారని అన్నారు.

మీరిచ్చిన ఉద్యోగాల హామీని నమ్ముకున్న పలువురు అమాయక నిరుద్యోగులు బలవన్మరణాలకు పాల్పడ్డారని విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ ప్రాజెక్టుల నుంచి తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటి వాటా విషయంలో సైతం కేసీఆర్ సర్కారు విఫలమైందని దుయ్యబట్టారు. మొత్తంగా చూస్తే, అటు ఉద్యమ కాలంతో పాటు పాలనా పగ్గాలు అందుకున్న నాటి నుంచీ కేసీఆర్ చెబుతూ వచ్చిన "మా నీళ్ళు మాకు... మా ఉద్యోగాలు మాకు" అనే నినాదం, ఆయన అధికారానికి వచ్చినా సాకారం కాని దారుణ పరిస్థితిలో రాష్ట్రం ఉందని అన్నారు.

ఇక భూసంస్కరణలంటూ కేసీఆర్ సర్కారు ప్రారంభించిన ధరణి వెబ్ సైటు చుక్కలు చూపిస్తోందని విజయశాంతి ఎద్దేవా చేశారు. ఇవిగాక డబుల్ బెడ్రూములు, దళితులకు మూడెకరాలు, తాజాగా వరదసాయం, మీ నేతల కబ్జాలు, అవినీతి... ఇలా చెప్పుకుంటూ పోతే టీఆర్ఎస్ వైఫల్యాల వరుసక్రమానికి ఆకాశమే హద్దని అన్నారు. మీరిచ్చే హామీలన్నీ ఓట్ల కోసం వేసే గాలాలేనని ప్రజలు బాగా అర్థం చేసుకున్నారని... మీరు వారి మధ్యకెళ్ళినప్పుడల్లా దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలను గుర్తు చేస్తూనే ఉంటారని సెటైర్లు వేశారు.
Go Back to Shorts
Vijayashanti
BJP
KCR
TRS

More Telugu News