చైనాలో హీరోగా మారిన బ్రిటన్ దౌత్యాధికారి... వీడియో ఇదిగో!
- కౌన్సిల్ జనరల్ గా పని చేస్తున్న స్టీఫెన్ ఎల్లిసన్
- నదిలో కొట్టుకుపోతున్న మహిళను కాపాడిన వైనం
- బ్రిటన్ కాన్సులేట్ అధికారిక పేజీల్లో ప్రకటన
ఈ ఘటన జోంగ్ షాంగ్ సమీపంలో జరిగింది. ఓ నది వద్ద ఎంతో మంది పర్యాటకులు సేద దీరుతున్న వేళ, అదే నగర సందర్శన నిమిత్తం వచ్చిన ఎల్లీసన్ అక్కడే ఉన్నారు. ఆ సమయంలో ఓ మహిళ నదిలో పడిపోయింది. ఆమె తల నీటిలో మునిగిపోయి ప్రవాహంలో కొట్టుకుపోతున్న వేళ, ఎల్లీసన్, వెంటనే నీటిలోకి దూకారు. "సమయానికి రక్షించడంతో ఆ మహిళ వెంటనే కోలుకుని ఊపిరి పీల్చుకుని, స్పృహలోకి వచ్చింది" అని బ్రిటన్ కాన్సులేట్ తన అధికారిక వెబ్ పేజీలో పేర్కొంది.
ఈ ఘటన మొత్తాన్ని, మహిళ నీటిలో పడిపోక ముందు నుంచే ఓ యువకుడు వీడియో తీశాడు. చైనా మీడియా సైతం ఇప్పుడు ఎల్లీసన్ పై పొగడ్తల వర్షం కురిపించింది. ఈ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. ఎల్లీసన్ బ్రిటన్ మొత్తం గర్వపడేలా వ్యవహరించారని యూకే డిప్లొమాటిక్ మిషన్ వ్యాఖ్యానించింది. ఈ వీడియోను మీరు కూడా చూడవచ్చు.