నడిరోడ్డుపై అమ్మాయిని తుపాకీతో కాల్చి చంపిన యువకుడు.. వీడియో ఇదిగో

27-10-2020 Tue 13:04
  • హ‌ర్యానాలోని వ‌ల్ల‌భ్‌గ‌ఢ్ జిల్లాలో ఘటన
  • యువతిని వేధిస్తోన్న యువకుడు
  • పరీక్ష రాసేందుకు వెళ్లిన అమ్మాయి
  • తన కారు ఎక్కట్లేదని కాల్చివేత
Girl shot dead

ఓ అమ్మాయిని ఓ యువకుడు నడిరోడ్డుపై తుపాకీతో కాల్చి చంపి కారులో పారిపోయిన ఘటన హ‌ర్యానాలోని వ‌ల్ల‌భ్‌గ‌ఢ్ జిల్లాలో చోటు చేసుకుంది. వ‌ల్ల‌భ్‌గ‌ఢ్‌కు చెందిన నిఖిత అనే యువ‌తి ప‌రీక్ష రాసేందుకు వెళ్తుండగా రోడ్డుపై తౌసీఫ్ అనే వ్య‌క్తి కారులో ఆమెను వెంబ‌డించాడు.

ఓ కాలేజీకి సమీపంలో కారు ఆపి, ఎక్కాలని ఆమెను బలవంత పెట్టాడు. ఆమె కారు ఎక్కకపోయేసరికి తుపాకీ తీసి ఆమెను కాల్చి చంపాడు. అనంతరం తన స్నేహితుడితో కలిసి కారులో పారిపోయాడు. ఆ అమ్మాయిని తౌసీఫ్ గ‌త కొంత కాలంగా వేధిస్తున్నట్లు తెలిసింది.

ఈ ఘటనపై ఆ యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో ద‌ర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు. ఈ ఘటనపై యువతి బంధు‌వులు పోలీస్ స్టేష‌న్ ఎదుట ధ‌ర్నాకు దిగారు. ఆ యువతిని తౌసీఫ్ వేధిస్తున్నాడంటూ ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.