బాలూ, నా మాట వినకుండా వెళ్లిపోయావ్.. ప్రపంచంలో దేన్నీ చూడలేను: ఇళయరాజా

25-09-2020 Fri 20:51
Ilayaraja gets emotional on SPBs death
  • నీ కోసం ఎదురు చూస్తుంటానని చెప్పాను
  • నీవు ఎక్కడకు వెళ్లావు? ఎందుకు వెళ్లావు?
  • నాకు మాటలు రావడం లేదు

దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. దశాబ్దాల పాటు వారి స్నేహబంధం కొనసాగింది. బాలుకి కరోనా అని తెలియగానే ఇళయరాజా తల్లడిల్లిపోయారు. 'బాలూ నీకోసం నేను ఎదురు చూస్తుంటా. తొందరగా వచ్చేయ్' అంటూ ఓ వీడియో ద్వారా తన బాధను ఇళయరాజా వెల్లడించిన విషయం తెలిసిందే. ఈరోజు బాలు తుదిశ్వాస విడవడంతో ఇళయరాజా కన్నీటిపర్యంతమవుతున్నారు.

'బాలూ నీ కోసం నేను ఎదురు చూస్తుంటానని చెప్పాను.. కానీ నా మాట వినకుండా వెళ్లిపోయావు' అని ఇళయరాజా ఆవేదన వ్యక్తం చేశారు. నీవు ఎక్కడకు వెళ్లావు? ఎందుకు వెళ్లావు? గంధర్వుల కోసం పాడేందుకు వెళ్లావా? అని నిలదీశారు. తనకు మాటలు రావడం లేదని... ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదని... ప్రపంచంలో దేన్నీ చూడలేనని అన్నారు. ఎంతటి దుఃఖానికైనా ఓ హద్దు ఉంటుందని... కానీ నీ విషయంలో దానికి పరిమితి లేదని చెప్పారు.