కేసీఆర్ ఆరోపణలపై సమీక్షా సమావేశంలో ప్రస్తావన.. స్పందించిన సీఎం జగన్!

Jagan Comments on KCR Fire Over Krishna Water
  • కేసీఆర్ ఆరోపణలను పట్టించుకోవద్దు
  • రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ లేదు
  • అపెక్స్ కౌన్సిల్ లోనే సమాధానం చెబుదాం
  • ఉమ్మడి రాష్ట్ర ప్రాజెక్టుల ఉత్తర్వులు సిద్ధం చేయండి
  • నీటి పారుదల శాఖ సమీక్షలో వైఎస్ జగన్
కృష్ణా నదీ జలాల విషయంలో కేసీఆర్ చేసిన ఆరోపణలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని సీఎం జగన్, అధికారులు, పార్టీ నేతలకు స్పష్టం చేసినట్టు సమాచారం. ముఖ్యంగా పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ ను విస్తరించడం ద్వారా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి నిత్యమూ మూడు టీఎంసీల నీటిని తరలించాలని ఆంధ్రప్రదేశ్ తీసుకున్న నిర్ణయాన్ని కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఈ నెల 20 తరువాత కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనే రాష్ట్రం తరఫున వాదనలు వినిపిద్దామని జగన్ వ్యాఖ్యానించినట్టు తెలిసింది.

తెలంగాణతో స్నేహ పూర్వక సంబంధాలనే కోరుకుంటున్నామని, ఇదే సమయంలో కృష్ణా ట్రైబ్యునల్ కేటాయింపుల మేరకే చేపడుతున్న ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకు సిద్ధంగా ఉండాలని, ప్రాజెక్టులపై రాష్ట్రం విడిపోవడానికి ముందు నుంచి అమలులో ఉన్న ఉత్తర్వులను సిద్ధం చేయాలని అధికారులను జగన్ ఆదేశించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఇక పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టేందుకు కృషి చేయాలని, పునరావాస కార్యక్రమాలపై దృష్టిని సారించాలని కూడా జగన్ ఆదేశించారు. ప్రాజెక్టు వ్యయంపై పెట్టిన ఖర్చులకు సంబంధించిన బిల్లులను తయారు చేసి కేంద్రానికి పంపాలని సూచించిన జగన్, వివిధ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేందుకు అన్ని చర్యలూ చేపట్టాలని ఆదేశించారు. గండికోట, చిత్రావతి రిజర్వాయర్, పైడిపాలెం ఎత్తిపోతల అభివృద్ధి పనులతో పాటు గాలేరు - నగరి, హంద్రీ - నీవా లింక్ కెనాల్ పనుల ప్రస్తావన కూడా ఈ సమీక్షలో వచ్చింది.
Go Back to Shorts
YS Jagan
Review
Water
Krishna River
KCR

More Telugu News