Kiran: మహేశ్ బాబు ఫైట్ ను రీ-క్రియేట్ చేసి.. 'ఔరా' అనిపించిన నెల్లూరు కుర్రాడు!

Nellore Youth Kiran Videos Viral
షార్ట్స్‌లో చూడండి
సోషల్ మీడియా పుణ్యమాని నెల్లూరుకు చెందిన మీనంగారి కిరణ్ అనే 19 ఏళ్ల యువకుడు ఒక్కసారిగా గుర్తింపు తెచ్చేసుకున్నాడు. ఇంతకూ అతను చేసిందేమంటారా? మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా, ఇటీవలి 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం ఇంటర్వెల్ ఫైట్ సీన్ ను, తన సమీపంలోని చిన్నారులతో రీ క్రియేట్ చేసి, అప్ లోడ్ చేయడమే. అంతేకాదు, అదే సినిమాలోని 'రమణా... లోడెత్తాలిరా... చెక్ పోస్ట పడతాది' అంటూ వచ్చే మరో ఫైట్ సీన్ ను కూడా చిత్రీకరించాడు.

గత సంక్రాంతికి వచ్చిన ఈ సినిమాలోని కర్నూలు కొండారెడ్డి బురుజు సెంటర్ సెట్ లో తీసిన ఇంటర్వెల్ ఫైట్, ఆపై నల్లమల అడవుల్లో వచ్చే ఫైట్ ఎంతగా అభిమానులను అలరించాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ ఫైట్స్ నే కిరణ్ తీయడం, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, వాటిని చూసిన దర్శకుడు అనిల్ రావిపూడి షేర్ చేస్తూ, ఇవి తనకు ఎంతగానో నచ్చాయని చెప్పడంతో కిరణ్ సెలబ్రిటీగా మారిపోయాడు.

అతన్ని ఇంటర్వ్యూ చేసేందుకు మీడియా పరుగులు పెట్టింది. ఇక, మీడియాతో మాట్లాడిన కిరణ్, తాను 9వ తరగతి వరకూ మాత్రమే చదువుతున్నానని, నాన్న చానాళ్ల క్రితమే చనిపోయాడని చెప్పుకొచ్చాడు. ఇద్దరు చెల్లెళ్లను చదివిస్తూ, చేపలు పట్టే వృత్తిలో తల్లికి సహకరిస్తున్నానని అన్నాడు. తాను పెంకులు తయారు చేసే పనిలో ఉన్నానని, గతంలో 'సర్కార్', 'కాటమరాయుడు' , 'మహానుభావుడు' చిత్రాల్లోని ఫైట్స్ ను తీసినా, ఇంత పేరు రాలేదని అన్నాడు.

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈ ఫైట్స్ ను పోస్ట్ చేశానని, వీటిని ఆ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి చూసి, వాటిని రీ ట్వీట్ చేయడం తనకెంతో ఆనందాన్ని కలిగించిందని అన్నాడు. తనకు మహేశ్ బాబు నుంచి పిలుపు వస్తే, అంతకన్నా ఆనందం మరొకటి ఉండదని చెప్పాడు. కాగా, కిరణ్ తీసిన ఈ రెండు వీడియోలను మీరూ చూడవచ్చు.
Go Back to Shorts
Kiran
Videos
Viral Videos
SarileruNeekevvaru

More Telugu News