Telangana: తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. 1,658 కేసులు ఒక్క గ్రేటర్‌ పరిధిలోనే!

1892 Corona Cases recorded in Telangana yesterday alone
తెలంగాణలో కరోనా కేసులు నిన్న రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. గత మూడు రోజులుగా వెయ్యికి పైగా కేసులు నమోదవుతుండగా నిన్న మాత్రం ఏకంగా 1,892 కేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. తాజా కేసుల్లో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 1,658 కేసులు అంటే 87.6 శాతం కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. నిన్న మొత్తం 5,965 మందికి పరీక్షలు చేయగా ఈ కేసులు బయటపడ్డాయి. 4,073 మందికి నెగటివ్‌గా నిర్ధారణ అయింది.

తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 20 వేల మార్కును దాటేసి 20,462గా నమోదైంది. 9,984 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. నిన్న ఒక్క రోజే 1,126 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఈ మహమ్మారిని నుంచి మొత్తం 10,195 మంది కోలుకోగా, తాజాగా 8 మంది కరోనాతో మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 283కు పెరిగింది. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,04,118 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

నిన్న నమోదైన మొత్తం కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 1,658 నమోదు కాగా, ఆ తర్వాత అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 56, మేడ్చల్‌లో 44, వరంగల్ రూరల్‌లో 41, సంగారెడ్డిలో 20, మహబూబ్‌నగర్‌లో 12, నల్గొండలో 13 కేసులు నమోదయ్యాయి. మహబూబాబాద్‌లో 7, వనపర్తిలో 5, భద్రాద్రి కొత్తగూడెంలో 4, ఖమ్మంలో 2 కేసులు వెలుగు చూశాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా, కామారెడ్డి జిల్లాలో ఆరేసి కేసుల చొప్పున నమోదు కాగా, సిద్దిపేట, మెదక్, నిజామాబాద్‌లలో మూడేసి కేసులు వెలుగు చూశాయి. కరీంనగర్, గద్వాల, ములుగు, జగిత్యాల, వరంగల్ అర్బన్, నాగర్ కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది.
.
Telangana
GHMC
Corona Virus
Warangal Rural District

More Telugu News