టిబెటన్ పీఠభూమిపై చైనా వాయు కార్యకలాపాలు ... రంగంలోకి ఎయిర్ ఫోర్స్!
- అనుక్షణం పహారా కాస్తున్న యుద్ధ విమానాలు
- పూర్తిగా ఆయుధాలు నింపుకుని వెళుతున్న ఫైటర్ జెట్స్
- జవాన్ల ప్రాణ త్యాగాలను వృథా పోనివ్వబోము
- ఎయిర్ చీఫ్ మార్షల్ బరోరియా
ఈ విమానాలను పూర్తిగా ఆయుధాలతో నింపి పంపుతున్నామని, టిబెట్ ప్రాంతంలో చైనా కార్యకలాపాలు పెరిగిన తరువాత మరింత అప్రమత్తమయ్యామని ఆయన స్పష్టం చేశారు. "ఏ విధమైన సైనిక కదలికలు కనిపించినా, అందుకు తగ్గట్టుగా స్పందించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేస్తున్నాం. గాల్వాన్ లోయలో మన సైనికుల ప్రాణ త్యాగాన్ని వృథా పోనివ్వబోము" అని ఆయన వ్యాఖ్యానించారు.
లడఖ్ లోని భారత గగనతలంపై అపాచీ హెలికాప్టర్లు, అప్ గ్రేడ్ చేసిన మిగ్-29 విమానాలు తిరుగుతున్నాయన్న చిత్రాలు విడుదలైన మరుసటి రోజున బరోరియా వ్యాఖ్యానించడం గమనార్హం. చైనా లడఖ్ ప్రాంతంలోని వాస్తవ నియంత్రణ రేఖకు దగ్గరగా ట్యాంకులను మోహరించినట్లు వచ్చిన నివేదికల నేపథ్యంలో వాస్తవాధీన రేఖ వెంబడి, అపాచీ చాపర్లు ఇప్పుడు గస్తీ కాస్తున్నాయి. ఇవి భూమిపై ఉన్న యుద్ధ ట్యాంకులను కూడా నాశనం చేయగల సత్తాను కలిగివుంటాయి. ప్రపంచంలోనే అత్యాధునిక చాపర్ గా పేరున్న అపాచీలు ఈ ప్రాంతంలో తిరుగుతున్నాయంటే, పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక నూతన రాడార్ మరియు ఏవియానిక్స్‌తో అప్‌గ్రేడ్ చేయబడిన మన మిగ్ - 29 విమానాలను కూడా సిద్ధం చేసింది. ఇదే సమయంలో సరికొత్త చినాక్ రవాణా హెలికాప్టర్లను సైతం వాయుసేన లడఖ్ ప్రాంతానికి తరలించింది. ఇవి ఎం-777 ఆర్టిలరీ గన్స్ ను కూడా అవసరమైన ప్రాంతానికి తీసుకెళ్లే సత్తాను కలిగివుంటాయి.
మరోవైపు చైనా సైతం సరిహద్దుల్లో విమానాల మోహరింపును పెంచింది. అదనపు సైన్యాన్ని, ఆయుధాలను టిబెట్ మీదుగా తరలిస్తున్నట్టు సమాచారం. దీంతో భారత్ మరింత అప్రమత్తమైంది.