ఏనుగు తిన్నది పైనాపిల్ కాదట... విచారణలో పలు విషయాలను వెల్లడించిన నిందితుడు!
- కొబ్బరికాయలో పేలుడు పదార్థాలు నింపి ఏనుగుకు తినిపించిన దుండగులు
- నరకయాతన అనుభవించి చనిపోయిన ఏనుగు
- దేశ వ్యాప్తంగా వ్యక్తమవుతున్న ఆగ్రహావేశాలు
మరోవైపు ఈ ఘటన మరో మలుపు తిరిగింది. అందరూ భావిస్తున్నట్టు ఏనుగు తిన్నది పైనాపిల్ కాదని... కొబ్బరికాయ అని పోలీసు అధికారులు తెలిపారు. పేలుడు పదార్థాలు నింపిన కొబ్బరికాయను తినడంతో పేలుడు సంభవించిందని చెప్పారు. గాయపడిన తర్వాత ఆహారం, నీరు తీసుకోలేని పరిస్థితుల్లో వెల్లియార్ నదిలో ప్రాణాలు విడిచిందని తెలిపారు. పట్టుబడిన నిందితుడిని విచారించడంతో... అతను ఈ వివరాలను వెల్లడించాడు.
ఈ కేసులో అరెస్టైన విల్సన్ అనే వ్యక్తి రబ్బరు సేకరించే వృత్తిలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. విచారణలో భాగంగా పేలుడు పదార్థాలు తయారు చేసిన ప్రాంతానికి కూడా నిందితుడిని తీసుకెళ్లామని చెప్పారు. అక్కడున్న ఓ షెడ్ లో మరో ఇద్దరితో కలిసి పేలుడు పదార్థాలను తయారు చేసినట్టు దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు. మరో ఇద్దరు నిందితులు పరారీలోనే ఉన్నారని, త్వరలోనే వారిని పట్టుకుంటామని చెప్పారు.