'బాహుబలి' కంటే నా సినిమానే ఎక్కువ వసూలు చేసింది: అమితాబ్ బచ్చన్

27-05-2020 Wed 20:56
  • 43 ఏళ్ల క్రితం విడుదలైన 'అమర్ అక్బర్ ఆంటోనీ'
  • అప్పట్లోనే రూ. 7.25 కోట్లు రాబట్టిన వైనం
  • ఒక లెక్క ప్రకారం 'బాహుబలి-2' కంటే రూ. 33 కోట్లు ఎక్కువ వసూలు చేసినట్టు
My movie collected more than Bahubali says Amitabh Bachchan

బాలీవుడ్ దిగ్గజాలు అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా, రిషి కపూర్ కలిసి నటించిన 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమా విడుదలై 43 ఏళ్లు పూర్తైంది. ఈ చిత్రం అఖండ విజయాన్ని సాధించింది. ఈ సందర్బంగా అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.

 'బాహుబలి: ది కన్ క్లూజన్' కంటే 'అమర్ అక్బర్ ఆంటోనీ' ఎక్కువ వసూళ్లను రాబట్టిందని అన్నారు. 43 ఏళ్ల క్రితం ఆ రోజుల్లోనే ఈ చిత్రం రూ. 7.25 కోట్లను రాబట్టిందని చెప్పారు. అన్ని విధాలుగా లెక్కిస్తే 'బాహుబలి-2' కంటే ఇదే ఎక్కువని అన్నారు. 'అమర్ అక్బర్ ఆంటోనీ' ముంబైలో 25 థియేటర్లలో 25 వారాల పాటు ఆడిందని... ఇప్పుడు ఏ చిత్రం అన్ని రోజులు ఆడటం లేదని చెప్పారు.

సినిమా విశ్లేషకుల లెక్కల ప్రకారం 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమా వసూళ్లు రూ. 7.25 కోట్లు అయినప్పుడు... అప్పట్లో టికెట్ విలువ రూ. 2 అనుకుంటే... మొత్తం 3,62,50,000 మంది చూసినట్టవుతుంది. ఈ ప్రేక్షకుల సంఖ్యను 'బాహుబలి-2' విడుదల నాటి టికెట్ ధర రూ. 150తో లెక్కిస్తే... మొత్తం రూ. 543 కోట్లు వసూలు చేసినట్టు లెక్క. 'బాహుబలి-2' చిత్రం ఇండియాలో రూ. 510 కోట్లు రాబట్టింది.