Kesineni Nani: నాపై దొంగ కేసులకు భయపడను..ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి: టీడీపీ ఎంపీ కేశినేని

TDP MP Kesineni Nani criticises Jagan
షార్ట్స్‌లో చూడండి
ఈ నెల 1 వ తేదీన విజయవాడలోని 47 డివిజన్ లో సామాజిక దూరం పాటించకుండా టీడీపీ ఎంపీ కేశినేని నాని పెద్దఎత్తున కూరగాయల పంపిణీ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయమై నాని స్పందిస్తూ, సామాజిక దూరం పాటిస్తూనే తాను నిత్యావసరాలు పంపిణీ చేశానని, గుమిగూడినట్టు మార్ఫింగ్ ఫొటోలు పెట్టి తనపై కేసు పెట్టారని ఆరోపించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్, వైసీపీపై మండిపడ్డారు. తనపై పెట్టిన దొంగ కేసులకు భయపడి పేదలకు, ఆపదలో ఉన్న వారికి సేవ చేయడం మానేస్తానని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తానని, ఎన్ని దొంగ కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండని మండిపడ్డారు. ఈ సందర్భంగా విజయవాడ పోలీస్ కమిషనర్ పైనా ఆయన విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతలు నిత్యావసరాల పంపిణీ సమయంలో గుమిగూడిన విషయమై తాము ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోలేదు? కేసు ఎందుకు నమోదు చేయలేదు? అని ప్రశ్నించారు. కేవలం, ప్రతిపక్ష పార్టీల నాయకులపైనే కేసులు నమోదు చేస్తారా? అంటూ విమర్శలు గుప్పించారు.
Go Back to Shorts
Kesineni Nani
Telugudesam
Jagan
YSRCP

More Telugu News