టి20 వరల్డ్ కప్: భారత అమ్మాయిలు భళా... బలమైన ఆసీస్ ను కంగుతినిపించారు!
- తొలి మ్యాచ్ లో టీమిండియా బోణి
- 17 పరుగుల తేడాతో ఆతిథ్య ఆసీస్ పై ఘనవిజయం
- 133 పరుగుల లక్ష్యఛేదనలో 115 పరుగులకే కుప్పకూలిన కంగారూలు
పూనమ్ తన 4 ఓవర్ల స్పెల్ లో కేవలం 19 పరుగులే ఇచ్చి 4 వికెట్లు తీసి కంగారూల పతనంలో ప్రధాన భూమిక పోషించింది. పూనమ్ కు శిఖా పాండే (3 వికెట్లు) కూడా తోడవడంతో ఆసీస్ ఇన్నింగ్స్ పేకమేడను తలపించింది. ఆసీస్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ అలీసా హీలీ 51 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. మిడిలార్డర్ లో ఆష్లే గార్డనర్ 34 పరుగులు చేయడంతో ఆసీస్ కు ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. హీలీ, గార్డనర్ మినహా మరెవ్వరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు.
సొంతగడ్డపై ఆడుతున్న ఒత్తిడి ఈ మ్యాచ్ లో ఆసీస్ అమ్మాయిలపై స్పష్టంగా కనిపించింది. ఎప్పుడూ పేస్ ఎక్కువగా ఎదుర్కొనే ఆస్ట్రేలియన్లను భారత అమ్మాయిలు స్పిన్, పేస్ అస్త్రాలతో కుప్పకూల్చారు.