విజయసాయిరెడ్డీ, ఓసారి ట్వీట్ చేయవయా... నీ ట్వీట్ చూసి చాలా రోజులైంది: దేవినేని ఉమ

16-02-2020 Sun 18:17
  • వైసీపీ నేతలపై ఉమ ఫైర్
  • విజయసాయిరెడ్డిపై ఆరోపణాస్త్రాలు
  • విశాఖలో భూములపై వైసీపీ నేతల కన్నుపడిందన్న ఉమ
Devineni Uma thrashes YSRCP MP Vijayasai Reddy

టీడీపీ నేత దేవినేని ఉమ వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రి బొత్స సత్యనారాణయపై విమర్శలు గుప్పించిన ఉమ, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని కూడా వదల్లేదు. విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించిన ఈ మాజీ మంత్రి విజయసాయిపై ఆరోపణాస్త్రాలు సంధించారు. విశాఖపట్నంలోని వెంకోజీపాలెంలో ఉన్న జ్ఞానానంద ఆశ్రమంపై వీళ్ల కన్నుపడిందని అన్నారు.

"మొత్తం ఆరున్నర ఎకరాల భూమి అది. దాదాపు రూ.300 కోట్ల విలువైన ప్రాపర్టీ. అక్కడున్న స్వామీజీని వెళ్లగొట్టి, ఆశ్రమానికి, గ్రామస్తులతో ఉన్న రోడ్డు గొడవను స్వలాభానికి వాడుకున్నారు. ఇదే కాదు విశాఖలో గయాలి భూములను కూడా వదలడంలేదు. కబ్జాలు చేసుకుంటూ పోతున్నారు. ఏ2 ముద్దాయి విజయసాయిరెడ్డీ, ఓసారి ట్వీట్ చేయవయా! నీ ట్వీట్ చూసి చాలా రోజులైంది. ఈ రూ.300 కోట్ల ఆశ్రమ ప్రాపర్టీని దోపిడీ చేయడానికి ఇప్పటికే ఆశ్రమ నిర్వాహకులకు బెదిరింపులు వెళ్లాయి. పోలీసులతో ఆశ్రమ వర్గాలను పిలిపిస్తున్నారు. దీనికోసమా మీరు విశాఖ వెళుతోంది?" అంటూ ఉమ నిలదీశారు.