Raithu Barosa: రైతు భరోసా కేంద్రాల ఏర్పాటును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాం: ఏపీ మంత్రి కన్నబాబు

  • మే నెల కల్లా కేంద్రాల ఏర్పాటు
  • భవిష్యత్తులో భరోసా కేంద్రాలు..సేకరణ కేంద్రాలుగా మారుతాయి  
  • మే 15 కల్లా రైతు భరోసా కేంద్రాల్లో విత్తనాల లభ్యత, పంపిణీ

రైతు భరోసా కేంద్రాల ఏర్పాటును తమ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని ఏపీ మంత్రి కన్నబాబు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మే కల్లా వీటి ఏర్పాటుకోసం అన్నీ సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు. భవిష్యత్తులో భరోసా కేంద్రాలు.. సేకరణ కేంద్రాలుగా మారుతాయన్నారు. సుబాబుల్, యూకలిప్టస్ ధర కోసం సాయం అందించేందుకు కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో గిట్టుబాటు ధరలను బోర్డుల ద్వారా ప్రకటిస్తారన్నారు.

శాశ్వత కొనుగోలు కేంద్రాలుగా మార్కెట్ యార్డులుంటాయన్నారు. మే 15 కల్లా రైతు భరోసా కేంద్రాల్లో విత్తనాల లభ్యత, పంపిణీ జరుగుతుందన్నారు. మొదటిసారిగా గ్రామ స్థాయిలో విత్తన సరఫరా చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ధరల స్థిరీకరణ కోసం ప్రతి వారం చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ధరలపై సీఎం ప్రతి నెల సమీక్ష చేస్తారన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పెద్ద ఎత్తున కోల్డ్ స్టోరేజ్ లు, గిడ్డంగులు ఏర్పాటు చేయనున్నామన్నారు. కేపీ ఉల్లిపై సీఎం కల్పించుకుని అనుమతులు తెప్పించామని, ఆర్గానిక్ మిల్క్ ఉత్పత్తిని ప్రోత్సహించాలని అన్నారు. ధాన్యం కొనుగోలు, ధరల విషయంలో చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు.

More Telugu News