Indians Released: భారత్‌కు మరో దౌత్య విజయం.. ఐదుగురు భారతీయ నావికులను విడుదల చేసిన ఇరాన్

  • ఏప్రిల్‌లో ఇజ్రాయెల్ వాణిజ్య నౌకను సీజ్ చేసిన ఇరాన్
  • నౌకలో 17 మంది భారతీయ సిబ్బంది 
  • మిగతా వారి విడుదలకు భారత ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు
In Diplomatic Win 5 Indian Sailors On Ship Seized By Iran Released

భారత్‌కు మరో దౌత్య విజయం దక్కింది. ఇరాన్ అధీనంలోని వాణిజ్య నౌక సిబ్బందిలో ఐదుగురు భారతీయులకు తాజాగా స్వేచ్ఛ లభించింది. ఇరాన్ ప్రభుత్వం వీరిని గురువారం విడుదల చేసింది. భారత నావికుల విడుదల విషయాన్ని భారత ఎంబసీ మీడియాతో పంచుకుంది. ఈ విషయంలో సహకరించిన ఇరాన్ అధికారులకు ధన్యవాదాలు తెలిపింది. ‘‘ఎమ్ఎస్‌సీ ఎరీస్ సరుకు రవాణా నౌకలోని ఐదుగురు భారతీయ నావికులు విడుదలయ్యారు. ఈరోజు సాయంత్రం ఇరాన్‌ నుంచి భారత్‌కు బయలుదేరారు’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. 

17 మంది భారతీయులు ఉన్న ఇజ్రాయెలీ సరుకు రవాణా నౌకను ఇరాన్ అధికారులు ఏప్రిల్ 13న తమ అధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ ఈ నావను హార్ముజ్ జలసంధిలో ఉండగా సీజ్ చేశారు. నౌకలో చిక్కుకుపోయిన భారతీయుల్లో కేరళకు చెందిన ఆన్ టెస్సా జోసెఫ్‌ కూడా ఉన్నారు. అయితే, ఆమె ఏప్రిల్ 18న సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారు. మిగతా వారి విషయంలో కొన్ని కాంట్రాక్ట్ నిబంధనలు అడ్డుగా ఉన్నాయని, అవి పరిష్కారమయ్యాక వారు తిరిగొస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 

భారతీయులు ఇరాన్ అదుపులో ఉన్నారన్న విషయం తెలియగానే భారత అధికారులు రంగంలోకి దిగారు. భారత విదేశాంగ మంత్రి జై శంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రితో ఫోన్లో చర్చించారు. మరోవైపు, ఈ విషయమై భారత్‌లోని ఇరాన్ రాయబారి స్పందిస్తూ తాము భారతీయ నావికులను అదుపులోకి తీసుకోలేదని అన్నారు. వారికి తిరిగెళ్లేందుకు స్వేచ్ఛ ఉందని తెలిపారు.

  • Loading...

More Telugu News