యూపీ ఉన్మాది ఘటనలో బాలిక సమయస్ఫూర్తి!
- కుమార్తె బర్త్ డేకి ఆహ్వానించి పిల్లలను నిర్బంధించిన ఉన్మాది
- బెదిరింపులకు లొంగకుండా చిన్నారుల ప్రాణాలు కాపాడిన బాలిక
- పోలీసు కాల్పుల్లో హతమైన ఉన్మాది
సుభాష్ బాథమ్ తన కుమార్తె బర్త్ డే అని చెప్పి 20 మంది చిన్నారులను ఆహ్వానించి వారందరికీ తినుబండారాలు ఇచ్చి ఆపై బేస్ మెంట్ లో బంధించాడు. తుపాకీతో బెదిరించడంతో ఆ బాలలు హడలిపోయి ఏడుపు లంకించుకున్నారు. ఆ చిన్నారుల్లో అందరికంటే పెద్దదైన 15 ఏళ్ల బాలిక కొద్దిసేపట్లోనే తేరుకుని మిగతా బాలబాలికలను సముదాయిస్తూ ఎంతో నిబ్బరం కనబర్చింది. దాదాపు 9 గంటల పాటు కిడ్నాపర్ చెరలో ఉన్న పిల్లలకు అన్నీ తానే అయింది. ఓ దశలో తన ఇంటిని పోలీసులు చుట్టుముట్టారన్న కోపంతో పిల్లల్ని చంపేందుకు సుభాష్ బాథమ్ ప్రయత్నించాడు.
ఈ విషయం గ్రహించిన ఆ బాలిక వెంటనే బేస్ మెంట్ తలుపులను లోపలి నుంచి గడియ వేసేసింది. తలుపులు తీయాలంటూ ఆ ఉన్మాది ఎంత రంకెలు వేసినా బాలిక ధైర్యంగా వ్యవహరించింది. చివరికి పోలీసులు వచ్చాకే బేస్ మెంట్ తలుపులు తెరిచింది. ఇప్పుడా బాలికను పోలీసులు అభినందనల్లో ముంచెత్తుతున్నారు. ఆ బాలిక సమయోచితంగా వ్యవహరించబట్టే దుర్మార్గుడు సుభాష్ బాథమ్ పిల్లలను ఏమీ చేయలేకపోయాడని పోలీసులు చెబుతున్నారు.