యమునా నదిలో ఒకసారి మునగండి... అప్పుడు నమ్ముతాం: కేజ్రీవాల్ కు అమిత్ షా సవాల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యమునా నదిలో ఒకసారి మునగండి... అప్పుడు నమ్ముతాం: కేజ్రీవాల్ కు అమిత్ షా సవాల్

  • యమునా నది పరిశుభ్రంగా ఉందని మాటలు చెప్పడం కాదు
  • ఢిల్లీ జల్ బోర్టును నష్టాలపాలు చేశారు
  • అబద్ధాలు చెప్పడంలో కేజ్రీవాల్ నెంబర్ వన్
యమునా నది పరిశుభ్రంగా ఉందని మాటలు చెప్పడం కాదని... ఆ నదిలో ఒకసారి మునిగితే తాము నమ్ముతామని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సవాల్ విసిరారు. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ కు వెళ్లి, అక్కడి గంగానదిలో ఒకసారి స్నానం చేయాలని కేజ్రీవాల్ కు ఆయన సూచించారు. అప్పుడుకాని, నదులను పరిశుభ్రంగా ఎలా ఉంచాలన్న విషయం కేజ్రీవాల్ కు అర్థం కాదని చురక అంటించారు. ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లు గంగా నదిని పరిశుభ్రంగా మార్చేందుకు ఎంతో కృషి చేశారని చెప్పారు.

కేజ్రీవాల్ అధికారంలోకి రాకముందు ఢిల్లీ జల్ బోర్డు ఏడాదికి రూ. 178 కోట్ల లాభాలతో నడిచేదని... ప్రస్తుతం అది ఏడాదికి రూ. 800 కోట్ల నష్టాన్ని చవిచూస్తోందని అమిత్ షా విమర్శించారు. ఢిల్లీలో వెయ్యి కొత్త పాఠశాలలు, 50 కొత్త కాలేజీలను ఏర్పాటు చేస్తామని, నగరంలో 15 లక్షల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని ఐదేళ్ల క్రితం కేజ్రీవాల్ ఇచ్చిన హామీలు ఇంత వరకు నెరవేరలేదని అన్నారు. ఇప్పటి వరకు 1.50 లక్షల సీసీటీవీ కెమెరాలను మాత్రమే ఏర్పాటు చేశారని... వాటిలో కూడా 1.25 లక్షల కెమెరాలను కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఏర్పాటు చేశారని ఎద్దేవా చేశారు. అబద్ధాలు చెప్పడంలో కేజ్రీవాల్ నెంబర్ వన్ అని విమర్శించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, ఆప్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్న సంగతి తెలిసిందే.
Arvind Kejriwal
Amit Shah
BJP
AAP

More Telugu News