Maharashtra: అవును వాళ్లను తరిమి కొట్టాల్సిందే.. అనుమానం లేదు!: 'శివసేన' పత్రిక సామ్నాలో వివాదాస్పద కథనం

  • పాక్, బంగ్లా ముస్లింలను తరిమికొట్టాలన్న శివసేన  
  • మిత్రపక్షాలు కాంగ్రెస్, ఎన్సీపీల తీరుకు వ్యతిరేకంగా గళం 
  • మహారాష్ట్ర నవనిర్మాణ సేనపై విమర్శలు

మహారాష్ట్రలో అధికారంలో వున్న శివసేన అధికార పత్రిక సామ్నాలో ప్రచురితమైన కథనం ఒకటి ప్రస్తుతం సంచలనాత్మకమవుతోంది. ఓవైపు కాంగ్రెస్, ఎన్సీపీల మద్దతుతో ప్రభుత్వాన్ని నడుపుతున్న శివసేన, పౌరసత్వ సవరణ చట్టంపై ఆ రెండు పార్టీల గళానికి భిన్నమైన గళం వినిపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 

వివరాల్లోకి వెళితే... భారత్ లో ఉంటున్న పాకిస్థాన్, బంగ్లాదేశ్ ముస్లింలను ఎట్టి పరిస్థితులలోనూ తరిమేయాల్సిందేనన్నది ఈ రోజు ప్రచురితమైన కథనం సారాంశం. ఇటీవల తన జెండా రంగును పూర్తిగా కాషాయంలోకి మార్చిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎస్)ను విమర్శిస్తూ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాకపోతే ఈ కథనంలోని ట్విస్ట్ పై పరిశీలకులు తలలు పట్టుకుంటున్నారు.

'అవును. పాక్, బంగ్లా ముస్లింలను తరిమి కొట్టాల్సిందే. అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ అలా చేయాలంటే ముందు మీ జెండా రంగును మార్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే, శివసేన ఎప్పుడూ తన జెండా రంగు మార్చుకోలేదు' అంటూ ఎంఎన్ఎస్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. 

మరాఠీ సిద్ధాంతాలతో పద్నాలుగేళ్ల క్రితం ఎంఎస్ఎస్ ను స్థాపించిన రాజ్ థాకరే కొన్నాళ్ల క్రితం వరకు సీఏఏకు వ్యతిరేకంగా మాట్లాడారు. కానీ ఇటీవల ఆయన హిందుత్వ సిద్ధాంతాలను అందిపుచ్చుకుని అనుకూలంగా మారడాన్ని శివసేన తప్పుపడుతోంది.

'సీఏఏ వల్ల కేవలం ముస్లింలే కాదు, హిందువులు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఈ చట్టంలో చాలా లోపాలున్నాయి. ఇవేవీ పట్టించుకోకుండా కేవలం ఓట్ల కోసం రంగులు మారుస్తున్నారు. రాజకీయ లబ్ధికోసం బీజేపీ చేస్తున్న ప్రయత్నం ఇది' అంటూ ఆ పత్రిక తన కథంలో వ్యాఖ్యానించింది. 

More Telugu News