BTech Ravi: వైఎస్ భారతి పసుపు వస్త్రాలను ధరించలేదా? వివేకా గురించి 2017లోనే జగన్ కు తెలుసు: బీటెక్ రవి

  • పెత్తందారులకు ప్రతినిధి జగన్ అన్న బీటెక్ రవి
  • బ్యాండేజ్ తో పులివెందులలో కూడా సానుభూతి పొందాలనుకున్నారని విమర్శ
  • జగన్ కు పులివెందుల ప్రజలు బుద్ధి చెపుతారని వ్యాఖ్య
Jagan knows about YS Viveka in 2017 says BTech Ravi

పెత్తందార్లకు అసలైన ప్రతినిధి సీఎం జగన్ అని టీడీపీ నేత బీటెక్ రవి విమర్శించారు. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జగన్ పై బీటెక్ రవి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కడపలో మీడియాతో ఆయన మాట్లాడుతూ... ఎక్కడకు వెళ్లినా పేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధం జరుగుతోందని జగన్ అంటుంటారని.. పెత్తందార్లకు ఆయనే ప్రతినిధి అని అన్నారు. 

రూ. 750 కోట్ల ఆస్తులు ఉన్నట్టు జగన్ ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారని... ఆయనపై పోటీ చేస్తున్న తనకు కేవలం రూ. 80 లక్షల విలువైన ఆస్తి మాత్రమే ఉందని బీటెక్ రవి తెలిపారు. దీన్నిబట్టి పేదవాడు ఎవరో, పెత్తందారు ఎవరో పులివెందుల ప్రజలు ఆలోచించుకోవాలని చెప్పారు. నుదిటికి బ్యాండేజ్ వేసుకొచ్చి పులివెందులలో కూడా సానుభూతి సంపాదించుకోవాలని ప్రయత్నించారని... ఇక్కడి ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. 

సొంత చెల్లెలు షర్మిల చీర గురించి కూడా జగన్ నీచంగా మాట్లాడారని విమర్శించారు. జగన్ భార్య భారతి పసుపు వస్త్రాలను ధరించలేదా? అని ప్రశ్నించారు. జగన్ ఎంత దిగజారిపోయారో ఆయన వ్యాఖ్యలతో అర్థమవుతోందని చెప్పారు. సొంత చిన్నాన్న గురించి పులివెందులలోనే నీచంగా మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. వివేకాకు రెండో పెళ్లి జరగలేదా అని జగన్ ప్రశ్నించారని... 2017 ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనే జగన్ కు ఆ విషయం తెలుసని... అయినా ఎమ్మెల్సీ టికెట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ వివేకా వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడూ మాట్లాడలేదని... సొంత అన్న కుమారుడు జగన్ మాట్లాడటం దారుణమని చెప్పారు.  

వివేకా హత్య కేసులో నిందితుడైన అవినాశ్ మంచివాడని జగన్ సర్టిఫికెట్ ఎలా ఇస్తారని బీటెక్ రవి ప్రశ్నించారు. విధిలేని పరిస్థితుల్లో జగన్ మాట్లాడుతున్నారని... అవినాశ్ ను చిన్న పిల్లాడు, అమాయకుడు అని వెనకేసుకొస్తున్నారని అన్నారు. పులివెందులలో జగన్ నామినేషన్ కు డబ్బు, మద్యం ఇచ్చి పెద్ద ఎత్తున జనాలను సమీకరించారని చెప్పారు. సొంత నియోజకవర్గంపై జగన్ ఎంతో నిర్లక్ష్యం ప్రదర్శించారని... ప్రజలు ఆయనకు బుద్ధి చెపుతారని అన్నారు.

More Telugu News