CM Revanth Reddy: రుణమాఫీ చేయకుంటే మాకు ఈ అధికారం ఎందుకు?: రేవంత్ రెడ్డి

  • ఆరు నూరైనా సరే ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేసి తీరతామని వెల్లడి
  • స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖ రెడీగా పెట్టుకోవాలని హరీశ్ రావుకు సూచన
  • సెమీ ఫైనల్ లో బీఆర్ఎస్ ను ఓడించామని, ఫైనల్ లో బీజేపీని ఓడిస్తామని ధీమా
Revanth Reddy Reaction On Harish Rao Resign Letter

రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు, సీఎం రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం తన రాజీనామా లేఖతో గన్ పార్క్ వద్దకు చేరుకున్న హరీశ్ రావు.. రిజైన్ లెటర్ తో రమ్మంటూ సీఎంకు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం స్పందించారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ మీడియా వారియర్లతో భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు ఛాలెంజ్ ను ప్రస్తావిస్తూ.. ఓ సీస పద్యాన్ని రాసుకుని పట్టుకొచ్చిన కాగితాన్ని రాజీనామా లెటర్ అంటూ హరీశ్ రావు డ్రామాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజీనామా లేఖకు ప్రత్యేకంగా ఫార్మాట్ ఉంటుందని, అందులో ఒక్క అక్షరం అటూఇటైనా కూడా స్పీకర్ ఆమోదించరని చెప్పారు. అప్పుడు అది చిత్తు కాగితంతో సమానమని వివరించారు.

ఆరు నూరైనా సరే ఆగస్టు 15 లోపు రైతుల రుణాలు రూ.2 లక్షల లోపున్న వాటిని ఒక్కసారే మాఫీ చేసి తీరుతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులకు రుణమాఫీ చేయలేకపోతే తమకు అధికారమెందుకని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చుతుందని చెబుతూ.. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖను సిద్ధం చేసి పెట్టుకోవాలని హరీశ్ రావుకు సీఎం సూచించారు. సెమీ ఫైనల్ గా భావించిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పై విజయం సాధించామని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. అదేవిధంగా ఫైనల్ గా భావిస్తున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 17 లోక్ సభ నియోజకవర్గాల్లో 14 సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంటుందని రేవంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.

More Telugu News