అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. సెల్ టవర్ ఎక్కిన నలుగురు యువకులు

18-01-2020 Sat 16:27
  • తుళ్లూరులో ఘటన
  • అమరావతిని రాజధానిగా కొనసాగించాలని నినాదాలు
  • భారీ సంఖ్యలో గుమికూడిన ప్రజలు, రైతులు  

అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ఏపీలో పోరాటం ఉద్ధృతమవుతోంది. ఈ క్రమంలో రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దని డిమాండ్ చేస్తూ, ఈ రోజు నలుగురు యువకులు తుళ్లూరులో సెల్ టవర్ ఎక్కారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని వారు నినాదాలు చేస్తున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భారీ ఎత్తున ప్రజలు, రైతులు అక్కడికి చేరుకుంటున్నారు. శాంతి భద్రతల పరిరక్షణకోసం పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు.  

మరోవైపు మంగళగిరిలో ప్రజా బ్యాలెట్ కార్యక్రమాన్ని రాజకీయ జేఏసీ ప్రారంభించనుంది. అమరావతి రాజధానిగా ఉండాలనే అంశంపై ప్రజా బ్యాలెట్ నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత నారా లోకేశ్, జేఏసీ ప్రతినిధులు పాల్గొననున్నట్లు తెలుస్తోంది.