Balmoori Venkat: హరీశ్ రావు రాజీనామాను ఆమోదింప చేసే బాధ్యతను నేను తీసుకుంటాను: బల్మూరి వెంకట్

  • అమరుల స్తూపాన్ని బీఆర్ఎస్ నాయకులు అపవిత్రం చేశారని విమర్శ
  • అందుకే ఇక్కడ పసుపు నీళ్లతో శుద్ధి చేసినట్లు తెలిపిన బల్మూరి వెంకట్
  • ఆగస్ట్ 15లోగా రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్న బల్మూరి వెంకట్
  • హరీశ్ రావు రాజీనామాతో కొత్త డ్రామాకు తెరలేపారని ఆరోపణ
Balmoori Venkat responds on harish rao resignation

పంద్రాగస్ట్ లోగా తాము రుణమాఫీ చేసి హామీని నిలబెట్టుకుంటామని... ఆ తర్వాత తానే బాధ్యత తీసుకొని హరీశ్ రావు రాజీనామాను ఆమోదింప చేస్తానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బల్మూరి వెంకట్ అన్నారు. రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావులు సవాళ్లు... ప్రతిసవాళ్లు విసురుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం హరీశ్ రావు తన రాజీనామా లేఖతో గన్ పార్క్ వద్దకు వచ్చారు. రేవంత్ రెడ్డి కూడా తన రాజీనామా లేఖతో రావాలని సవాల్ చేశారు. దీంతో హరీశ్ రావుపై బల్మూరి వెంకట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమరుల స్తూపాన్ని బీఆర్ఎస్ నాయకులు అపవిత్రం చేశారని విమర్శించారు. అందుకే ఇక్కడ పసుపు నీళ్లతో శుద్ధి చేసినట్లు తెలిపారు. ఆగస్ట్ 15లోగా రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ హరీశ్ రావు రాజీనామా లేఖతో కొత్త డ్రామాకు తెరలేపారని ఆరోపించారు. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్ట్ 15లోగా రుణమాఫీ చేస్తామని... ఆ తర్వాత హరీశ్ రావు రాజీనామాను ఆమోదించేలా చూస్తామన్నారు.

అమరుల చావుకు కారకుడే హరీశ్ రావు అని ఆరోపించారు. నిరుద్యోగులు, ఉద్యోగులను రెచ్చగొట్టి వారిని పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వ్యక్తి అమరుల స్థూపం వద్దకు రావడంతో అపవిత్రం అయిందన్నారు. అందుకే పసుపు నీళ్లతో శుద్ధి చేసినట్లు చెప్పారు. పదేళ్ళుగా హరీశ్ రావుకు ఎప్పుడూ అమరవీరులు గుర్తుకు రాలేదా? అని మండిపడ్డారు.

More Telugu News