Iran: ట్రంప్ ట్వీట్ పై జోక్ వేసి.. ఉద్యోగం పోగొట్టుకున్న భారత సంతతి ప్రొఫెసర్!

  • ఇరాన్ ను హెచ్చరిస్తూ ట్రంప్ ట్వీట్
  • ప్రతిగా ఫేస్ బుక్ లో జోక్ వేసిన అషీన్ ఫాన్సే
  • విధుల నుంచి తప్పించిన యూనివర్శిటీ

తన ఫేస్ బుక్ ఖాతాలో ఇరాన్ లో నెలకొన్న పరిస్థితులను ప్రస్తావిస్తూ, అమెరికాపై జోక్ వేసిన ఓ ఇండియన్ - అమెరికన్ ప్రొఫెసర్, తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. తన వ్యక్తిగత ఖాతాలో కాలేజ్ సంస్కృతి, విలువలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినందున అషీన్ ఫాన్సే అనే ప్రొఫెసర్ ను విధుల నుంచి తొలగించినట్టు బాబ్ సన్ కాలేజ్ ప్రకటించింది.

కాగా, ఆయన పోస్ట్ ఓ హెచ్చరికగా కనిపిస్తుండగా, అది కేవలం ఓ జోక్ మాత్రమేనని చెబుతూ, వివరణ ఇచ్చిన అషీన్, ఆపై క్షమాపణలు కూడా చెప్పారు. ఇరాన్ లోని 52 లక్ష్యాలను తాము ఛేదించేందుకు సిద్ధంగా ఉన్నామని ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

దీనిపై స్పందిస్తూ, ఇరాన్ కూడా మిన్నెసోటాలోని అమెరికా మాల్, కర్దాషియన్స్ నివాసం వంటి 52 లక్ష్యాలను సెలక్ట్ చేసుకోవాలని అషీన్ ఓ పోస్ట్ పెట్టారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. బోస్టన్ కు 20 కిలోమీటర్ల దూరంలోని వెల్స్ లీలో ఉన్న బాబ్ సన్ కాలేజీలో సస్టెయినబిలిటీ విభాగానికి అషీన్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. తన స్నేహితుల కోసం ఫేస్ బుక్ లో వేసిన జోక్ ను ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన అన్నారు.

More Telugu News