సెల్ ఫోన్ పరిచయం... హైదరాబాద్ యువతికి వేధింపులు... అరెస్ట్ చేసిన పోలీసులు!

12-01-2020 Sun 08:45
  • బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రశాంత్
  • ప్రేమ పేరిట వేధింపులు
  • రిమాండ్ కు తరలించిన పోలీసులు

సెల్ ఫోన్ లో మాట్లాడిన పరిచయంతో ప్రేమ పేరిట యువతిని వేధిస్తున్న ఓ యువకుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే, కూకట్ పల్లి గాజుల రామారం ప్రాంతానికి చెందిన ఓ యువతి (22) ఓ ప్రైవేటు కార్యాలయంలో పనిచేస్తోంది. బెంగళూరులో పనిచేస్తున్న ప్రశాంత్ (24) అనే యువకుడు ఆమెకు సెల్ ఫోన్ లో పరిచయం అయ్యాడు.

ఈ క్రమంలో హైదరాబాద్ కు వచ్చిన అతను, తనను కలవాలని, లేకుంటే ఆఫీసుకు వచ్చి గొడవ చేస్తానని బెదిరించాడు. దీంతో భయపడిన ఆమె, ఓ పార్కులో అతన్ని కలిసేందుకు వెళ్లింది. ఆ సమయంలో అతను అసభ్యకరంగా ప్రవర్తించాడు. విషయాన్ని ఎవరికైనా చెబితే, చంపేస్తానని బెదిరింపులకు దిగాడు.

10వ తేదీన ఆఫీసు వద్దకు వచ్చిన ప్రశాంత్, తోటి ఉద్యోగుల ముందు మరోసారి వేధించాడు. దీంతో ఆందోళనకు గురైన ఆమె, పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రశాంత్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు.