పండుగకు ఊరెళ్లాలి... మరి వెళ్లే దారెక్కడ?

10-01-2020 Fri 10:20
  • రైళ్లు కిటకిటలాడుతుండడంతో ప్రయాణ పాట్లు 
  • కాళ్లు కూడా కదపలేని విధంగా బోగీల్లో రద్దీ
  • పాఠశాలలకు సెలవులతో మరింత ప్రభావం

ఎక్కడెక్కడో స్థిరపడిన తెలుగు రాష్ట్రాల ప్రజలు, మరీ ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో ఉద్యోగాలు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న వారు పండుగ ప్రయాణానికి పాట్లు పడుతున్నారు.

సంక్రాంతికి సొంతూరు వెళ్లాలని వీరు కోరుకోవడం సహజం. దూర ప్రాంతం కావడం, బస్సుల్లో చార్జీల మోత మోగుతుండడంతో ఎక్కువ మంది రైలు ప్రయాణాన్ని కోరుకుంటారు. కానీ ప్రస్తుతం రైళ్లన్నీ కిటకిటలాడుతుండడంతో వీరికి దిక్కుతోచడం లేదు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ యాత్రను తలపిస్తోంది. జనరల్ బోగీ వద్ద యుద్ధవాతావరణమే నెలకొంటోంది. ఏదోలా కష్టపడి రైలు ఎక్కినా కాలు కదపడానికి కూడా వీలులేని విధంగా బోగీలు కనిపిస్తున్నాయి.

స్టేషన్లో రైలు ఎక్కడమే పెద్ద సవాల్ గా మారితే ప్రయాణం కొనసాగింపు మరింత సవాల్ గా మారడంతో ఆందోళన చెందుతున్నారు. జనరల్ బోగీల్లో కింద కూర్చుని, చివరికి మరుగు దొడ్లలో నిల్చుని ప్రయాణం చేయాల్సిన దుస్థితి. నిన్న సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన గోదావరి ఎక్స్ ప్రెస్, విశాఖ, చెన్నై, చార్మినార్, గరీబ్ రథ్, గౌతమి, శాతవాహన, పల్నాడు, నర్సాపూర్, ఎల్ టీటీ ఎక్స్ ప్రెస్ రైళ్లు కిటకిటలాడాయి.

రిజర్వేషన్ చేయించుకున్న వారు కూడా బోగీలోకి వెళ్లేందుకు నానా పాట్లు పడ్డారు. సోమవారం నుంచి పండగ సెలవులు ప్రారంభమవుతుండడంతో పరిస్థితి మరింత క్లిష్టమవుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా రెండో శనివారం, ఆదివారం సెలవు కావడంతో శుక్రవారం సాయంత్రం, శనివారం ఉదయం నుంచే చాలామంది బయలుదేరుతారు. దీంతో ప్రయాణం మరింత కష్టమేనని భావిస్తున్నారు.