నాకు వయసు అయిపోయిందట... మీ 151 మందికి నేనొక్కడ్ని చాలు!: చంద్రబాబు

09-01-2020 Thu 20:01
  • మచిలీపట్నంలో చంద్రబాబు ప్రసంగం
  • ప్రజా చైతన్య యాత్రలో పాల్గొన్న బాబు
  • వైసీపీ నేతలపై ఆగ్రహావేశాలు

మచిలీపట్నంలో ఈ సాయంత్రం జరిగిన ప్రజా చైతన్య యాత్రలో అమరావతి రైతుల కోసం జోలె పట్టి విరాళాలు సేకరించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అధికార పక్షంపై నిప్పులు చెరిగారు. మచిలీపట్నం కోనేటి కట్ట సెంటర్ లో మాట్లాడుతూ, తనకు వయసైపోయిందని అంటున్నారని, కానీ తానొక్కడినే 151 మంది వైసీపీ వాళ్లకు సమాధానం చెప్పగలనని ధీమా వ్యక్తం చేశారు. మీరు 151 మంది... నేను ఒక్కడ్ని. మీ అందరికీ బుద్ధి చెప్పగలను. జాగ్రత్తగా ఉండండి అంటూ హెచ్చరించారు.

పుట్టిన ప్రతి ఒక్కరూ చనిపోక తప్పదని, అందుకే తాను బతికినన్నాళ్లు ప్రజల కోసమే బతుకుతాను తప్ప తన కోసం కాదని ఉద్ఘాటించారు. "మహాత్మా గాంధీ, ఎన్టీఆర్ లు చనిపోయిన తర్వాత కూడా వాళ్ల గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? వారు చేసిన మంచి పనుల వల్లే. నేను కూడా అలాంటి మంచి పేరు కోసమే బతుకుతున్నాను. నా కోసం నేను బతకడంలేదు. నాకేం ఉద్యోగం అవసరం లేదు. నా రికార్డు బ్రేక్ చేసే పరిస్థితిలో ఎవరూ లేరు. కానీ తప్పుడు ఆలోచనలతో ఉండే వ్యక్తి మీ భవిష్యత్తును నాశనం చేస్తున్నాడు, అదే నా బాధ.

గుంటూరు, కృష్ణా జిల్లా ప్రజలను నమ్మాల్సిన పనిలేదంటున్నాడు. తనకు ఓట్లేయలేదంట. కానీ నేను ప్రజల కోసమే పనిచేశాను. నాడు హైదరాబాదులో ఎంతో అభివృద్ధి చేస్తే అక్కడి ప్రజలు కూడా నాకు 2004లో ఓటేయలేదు. అయినా బాధపడలేదు. నేను సమాజానికి ఇవ్వాలనుకుంటున్నాను తప్ప తిరిగి ఏమీ ఆశించడం లేదు. ఓ కుక్కను చంపడానికి పిచ్చికుక్క అనే ముద్ర వేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తారో అమరావతిని నాశనం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.  

పరిపాలన చేపట్టిన మొదటి రోజే అమరావతి మునిగిపోతుందని అన్నారు. నా ఇంటిని ముంచడానికి లంక గ్రామాలు ముంచారు. తొలిరోజే ప్రజావేదిక కూల్చారు. కానీ గ్రీన్ ట్రైబ్యునల్ ఎలాంటి ముప్పులేదని తెలిపింది. ఆ తర్వాత ఇన్ సైడర్ ట్రేడింగ్ అన్నారు. చేతనైతే మాట్లాడకుండా విచారణ జరిపించుకోండని చెప్పాను. చట్టపరంగా ముందుకెళ్లమని చెప్పాను.

ఇప్పుడు రాజధాని మార్చుతుంటే ఈ జిల్లా మంత్రులు హైపవర్ కమిటీలో చేరారు. సిగ్గుందా అని అడుగుతున్నా. మీరు నన్ను తిడతారా... చూస్తాను మీ కథేంటో. ఈ ప్రజలే చూసుకుంటారు. పోలీసులు తమని కాపాడతారని అనుకుంటున్నారు. ఇవాళ అమ్మ ఒడి కార్యక్రమానికి కూడా పోలీసులు ఉంటే తప్ప వెళ్లలేని నాయకులు ఈ వైసీపీ నాయకులు!

ఏంచేస్తారు పోలీసులు. నన్నేం చేయగలిగారు? మళ్లీ నన్ను తీసుకువచ్చి మా ఇంట్లో వదిలిపెట్టారు. ఒకవేళ తీసుకుపోయినా రెండ్రోజులు జైల్లో పెడతారు. ఈ ప్రజలే చూసుకుంటారంతా. ఈ ప్రజలే మీకు బట్టలూడదీస్తారు. ఇక్కడ జగన్ మోహన్ రెడ్డి చట్టంలేదు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. అందుకే రేపు శుక్రవారం జగన్ మోహన్ రెడ్డి కోర్టుకు వెళుతున్నాడు. వీళ్ల బాబాయిని చంపితే దిక్కులేదు" అంటూ వ్యాఖ్యానించారు.