జగన్ కు చెవి మిషన్, కళ్లజోడును పంపి, నిరసన తెలిపిన బుద్ధా వెంకన్న

08-01-2020 Wed 12:45
  • రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారంటూ బుద్ధా మండిపాటు
  • కేసీఆర్ పై ఉన్న ప్రేమ రాష్ట్ర ప్రజలపై లేదా? అని ప్రశ్న
  • కార్యకర్తలపై దాడి చేస్తే సహించబోమని హెచ్చరిక

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పట్ల టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అమరావతి రైతుల పట్ల జగన్ నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నారని ఆయన మండిపడ్డారు. జగన్ కు చెవి మిషన్, కళ్లజోడును కానుకగా పంపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'నేనున్నాను... నేను విన్నాను' అని జగన్ అన్నారని... 22 రోజులుగా రైతులు ఆందోళన చేస్తుంటే ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? అని ఆయన మండిపడ్డారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఉన్న ప్రేమ సొంత రాష్ట్ర ప్రజలపై లేదా? అని వెంకన్న ప్రశ్నించారు. అమరావతి రైతుల గుండెకోత మీకు వినపడటం లేదా? అని మండిపడ్డారు. అన్ని వసతులు ఉన్న అమరావతిని మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తల అంతు చూస్తామన్న మంత్రులపై డీజీపీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. తమ కార్యకర్తలపై దాడి చేస్తే సహించబోమని హెచ్చరించారు.