విశాఖ వద్దంటే బాబును ఉత్తరాంధ్రలో అడుగు పెట్టనివ్వం: స్పీకర్ తమ్మినేని

08-01-2020 Wed 11:19
  • ఈ ప్రాంత పౌరుడిగా ఇది నా డిమాండ్ 
  • సామాన్యుడికి రాజధానితో ఏం పనివుంటుంది
  • జగన్ అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారు

విశాఖను రాజధానిగా చేయడం వల్ల ఉత్తరాంధ్రతో పాటు అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని, దీన్ని చంద్రబాబు వ్యతిరేకిస్తే ఆయనను ఉత్తరాంధ్రలో అడుగు పెట్టనివ్వమని శ్రీకాకుళం జిల్లా అమదాలవలస ఎమ్మెల్యే, స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. స్పీకర్ గా తాను మాట్లాడడం లేదని, ఉత్తరాంధ్ర పౌరుడిగా ఇది తన డిమాండ్ అన్నారు.

 స్థానిక మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ విశాఖ రాజధానిపై టీడీపీ రాద్ధాంతం చేయడం తగదన్నారు. రాజధానితో సామాన్యుడికి పనిలేదని, అది ఎక్కడ ఉన్నా వారికి ఒకటేనన్నారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిన వారే మూడు రాజధానుల అంశాన్ని వ్యతిరేకిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజధానిని అడ్డుకుంటే సహించేది లేదని హెచ్చరించారు.