మహిళలపై దాడులకు ఇక కఠిన చర్యలే: ఏపీ దిశ చట్టం ప్రత్యేక అధికారిణి దీపిక పాటిల్

08-01-2020 Wed 08:27
  • మంగళవారం బాధ్యతలు స్వీకరించిన దీపిక
  • దర్యాప్తును త్వరితగతిన పూర్తిచేస్తామని హామీ
  • పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్తామన్న అధికారిణి

మహిళలపై జరుగుతున్న దాడులకు అడ్డుకట్ట వేస్తామని, దర్యాప్తును త్వరితగతిన పూర్తిచేసి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసిన ‘దిశ’ చట్టం ప్రత్యేక అధికారిణి దీపిక పాటిల్ అన్నారు. ఈ చట్టం అమలు కోసం స్పెషల్ ఆఫీసర్‌గా నియమితురాలైన దీపిక మంగళవారం బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేసి దిశ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామన్నారు. పక్కా ప్రణాళికతో ముందుకెళ్తామని వివరించారు. ఇక బాధ్యతలు చేపట్టకముందు వరకు దీపిక కర్నూలు ఏఎస్పీగా విధులు నిర్వర్తించారు. అంతకంటే ముందు గ్రేహౌండ్స్, పార్వతీపురం ఏఎస్పీగా పనిచేశారు. తిరుపతి ఏసీబీ విభాగంలో ఏఎస్పీగానూ పనిచేశారు. రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం ప్రవేశపెట్టిన ఏపీ దిశ చట్టం అమలు కోసం ప్రభుత్వం కృతికా శుక్లా, దీపిక పాటిల్‌లను ప్రత్యేక అధికారులుగా నియమించింది.