నిర్భయ దోషులకు డెత్ వారెంట్ జారీ.. 22న శిక్ష అమలు!

07-01-2020 Tue 17:03
  • తీర్పు వెలువరించిన పటియాలా హౌస్ కోర్టు
  • నిర్భయ దోషుల శిక్ష అమలు జాప్యంపై విచారణ
  • ఆనందం వ్యక్తం చేసిన నిర్భయ తల్లిదండ్రులు

నిర్భయ దోషులకు విధించిన ఉరిశిక్షపై పటియాలా హౌస్ కోర్టు తీర్పు వెలువరించింది. ఢిల్లీ తీహార్ జైల్లో ఉన్న దోషులకు ఈ నెల 22న ఉదయం 7 గంటలకు ఉరిశిక్ష అమలు చేయాలని తీర్పు చెప్పింది.  దోషులకు శిక్ష అమలులో జాప్యంపై నిర్భయ తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు దోషులకు డెత్ వారెంట్ జారీచేసింది. వాదనల సమయంలో.. తమకు న్యాయపరంగా అవకాశాలున్నాయని దోషుల తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ల దాఖలు ప్రక్రియ మొదలు పెట్టామని వారు తెలిపారు.

ఇది ఇలా ఉండగా.. దోషులకు డెత్ వారెంట్ వెంటనే జారీచేయాలని నిర్భయ తల్లిదండ్రుల తరపు న్యాయవాది కోరారు. క్యూరేటివ్, క్షమాభిక్ష పిటిషన్లకు అవకాశమున్నప్పుడు కూడా డెత్ వారెంట్ ఇవ్వొచ్చని కోర్టులో వాదించారు. క్యూరేటివ్ పిటిషన్ కు అవకాశముందని చెప్పి డెత్ వారెంట్ విడుదలను ఆపలేమని పేర్కొన్నారు. ప్రతిగా దోషుల తరపు న్యాయవాది స్పందిస్తూ.. క్యూరేటివ్ పిటిషన్ దాఖలుకు కొన్ని పత్రాలు రావాల్సి ఉందని చెబుతూ.. దోషి ముఖేశ్ కు సంబంధించిన పత్రాలు జైలు అధికారుల నుంచి రావాల్సి ఉందన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది.

ఎనిమిదేళ్ల క్రితం జరిగిన నిర్భయపై సామూహిక అత్యాచారం కేసులో నిందితులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు మరణ శిక్ష విధించగా.. అనంతరం వేసిన పిటిషన్లను విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు కూడా అదే శిక్షను ఖరారు చేసిన విషయం తెలిసిందే. అనంతరం సుప్రీం కూడా ఆ శిక్షనే ఖరారు చేసింది. దోషులకు డెత్ వారెంట్ జారీ అయిన నేపథ్యంలో నిర్భయ తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.