తిరుమల శ్రీవారి ఆలయంలో కుమార్తెతో కేటీఆర్... పక్కనే చెవిరెడ్డి!
- నేడు వైకుంఠ ఏకాదశి
- తిరుమలకు పోటెత్తిన ప్రముఖులు
- వీఐపీల దర్శనానికే రెండున్నర గంటల సమయం
తెలంగాణ మంత్రి కేటీఆర్, తన ఫ్యామిలీతో కలిసి ఒక రోజు ముందే తిరుమలకు చేరుకోగా, ఆయనకు స్థానిక నేతలు, టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. కేటీఆర్ దర్శనానికి వెళ్లే సమయంలో ఆయనతో పాటే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు. కేటీఆర్ కుటుంబీకులు ఆలయంలో ఉన్న చిత్రాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కేటీఆర్ తో పాటు తెలంగాణ మంత్రులు హరీశ్ రావు, కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత తదితరులు స్వామిని దర్శించి తరించారు.
ఏపీకి చెందిన మంత్రులు పుష్ప శ్రీవాణి, అవంతి శ్రీనివాస్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్ లు సుబ్బరామిరెడ్డి, చదలవాడ కృష్ణమూర్తి, కనుమూరి బాపిరాజు, పుట్టా సుధాకర్ యాదవ్ తదితరులు స్వామిని దర్శించుకున్నారు. గాలి జనార్దన్ రెడ్డి కుటుంబీకులు కూడా తిరుమలకు వచ్చి, వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయంలోకి వెళ్లారు. రాజేంద్ర ప్రసాద్, సునీల్, సుమలత, సప్తగిరి తదితర సినీ ప్రముఖులు కూడా విచ్చేశారు.