జనసంద్రం అంటే ఇదే... హైదరాబాద్ లో కదం తొక్కిన ముస్లింలు!

దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు హైదరాబాద్ కు కూడా పాకాయి. తాజాగా ప్రజాస్వామ్య వాదులు, మైనారిటీ సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. మిలియన్ మార్చ్ తరహాలో సాగిన ఈ ర్యాలీలో  వేలాది మంది ముస్లింలు తరలివచ్చి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఇందిరాపార్క్, ధర్నా చౌక్, ట్యాంక్ బండ్, ఎల్బీ స్టేడియం, మెహదీపట్నం తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. తెలంగాణ ఉద్యమం తర్వాత ఆ స్థాయిలో ప్రజలు రోడ్లపైకి రావడం ఇదే ప్రథమం. ఓవైపు జాతీయ పతాకాలు, మరో చేతిలో సీఏఏ, ఎన్నార్సీ, ఎన్ పీఆర్ వ్యతిరేక నినాదాలు ఉన్న ప్లకార్డులు ప్రదర్శిస్తూ ముస్లింలు కదం తొక్కారు.

ఈ నిరసన ప్రదర్శనలను 40 ముస్లిం సంఘాలతో కూడిన జేఏసీ నిర్వహించింది. గాంధీ, నెహ్రూ సాధించిన స్వాతంత్ర్యం తమకు మళ్లీ కావాలంటూ నినదిస్తూ ప్రజలు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు, ఎంబీటీ పార్టీ చీఫ్ అంజద్ ఉల్లా ఖాన్, తెహరీక్ ముస్లిం షబాన్ కన్వీనర్ ముస్తాన్ మాలిక్, అజీజ్ పాషా తదితర నేతలు పాల్గొన్నారు.

కాగా, ఈ ర్యాలీ కోసం ముస్లిం సంఘాలు కోర్టును ఆశ్రయించి అనుమతి తీసుకున్నాయి. మొదట అనుమతి నిరాకరించిన పోలీసులు ఆపై హైకోర్టు జోక్యంతో వెనక్కి తగ్గారు. లోయర్ ట్యాంక్ బండ్ నుంచి ధర్నా చౌక్ వరకు సాగిన ఈ ర్యాలీలో ప్రధానంగా వుయ్ వాంట్ జస్టిస్, హమ్ లేకే రహేంగే ఆజాదీ, మోదీ చోర్ హై అనే నినాదాలు మిన్నంటాయి.
Go Back to Shorts
Hyderabad
Muslims
Rally
CAA
NRC
NPR
Narendra Modi
BJP

More Telugu News